హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్‌లోని నీటిలో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్, భాజపా నేతలు ఆందోళన చేశారు. ముషీరాబాద్‌లోని గాయత్రీ సాయి ఈశ్వర్ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో ఉన్న రాజ్‌కుమార్ శనివారం రాత్రి వర్షం వెలిసిన తర్వాత సూపర్ మార్కెట్ కోసం బయటికి వచ్చారు. అపార్ట్మెంట్ సెల్లార్లో వర్షం నీరు ఉన్న విషయం తెలియక చీకటిలో వచ్చి అందులో పడి మరణించారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు నీటిని తొలగించలేదు.
ఆ ఘటనను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నేతలు అపార్ట్మెంట్ ముందు నిరసన జరిపారు. సమీప భవనంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్ తిరిగి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సంఘటన పట్ల ప్రభుత్వం స్పందించకపోవటంపై ఆయనను ప్రశ్నించారు. సెల్లార్లో మృతి చెందిన రాజ్‌కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు.