Man Blackmailed Girl at jawaharnagar : ఇన్‌స్టాగ్రామ్‌లో తనను ఫాలో చేయకపోతే ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియా(Social Media)లో పోస్టు చేసి, వైరల్ చేస్తానని ఓ ఆకతాయి పదిహేనేళ్ల బాలికను బెదిరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించిన యువకుడిపై కుటుంబసభ్యులు మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు చెందిన ఓ బాలిక గత నెల 23న బస్తీలో నడుచుకుంటూ వెళుతుంది. ఈ క్రమంలో ముఖానికి మాస్క్ ధరించి గుర్తు తెలియని యువకుడు బాలికను అడ్డగించాడు. ఆమె ఫొటోలు తన ఫోన్లో ఉన్నాయని బాలిక ఫొటోలను చూపించాడు. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో తనను ఫాలో కావాలని యువకుడు చెప్పి.. ప్రతిరోజు తనతో మాట్లాడాలని అన్నాడు. ఫాలో కాకపోయిన, మాట్లాడకుండా ఉన్నా వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెబితే చంపేస్తానన్నాడు. భయబ్రాంతులకు గురైన బాలిక తనను వేధింపులకు గురి చేయవద్దని పలుమార్లు వేడుకుందని పోలీసులు తెలిపారు.
Girl Blackmail Case In Hyderabad : అయినప్పటికీ మళ్లీ ఈ నెల 16వ తేదీన బాలికను రోడ్డుపై ఆపి.. ఆమె చేతిపై ఇన్‌స్టాగ్రామ్ ఐడీని రాసి.. ఫాలో కాకుంటే అంతు చూస్తానని యువకుడు వేధించాడని పోలీసులు పేర్కొన్నారు. అందుకు భయపడిన బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సామాజిక మాధ్యమాలపై సైబర్ పెట్రోలింగ్..:కొంత మంది సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అది ఎలాంటి సమాచారమో తెలియకపోయినా షేర్ చేస్తారు. ఎలా కామెంట్లు చేసినా ఏం కాదులే అన్న ధీమాతో.. ఆడపిల్లల ఫొటోలు కనిపిస్తే చాలు ఆకతాయిలు ఇష్టారీత్యా ఛాటింగ్ చేస్తుంటారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే మనం ఏం షేర్ చేసినా.. కామెంట్లు చేసినా పోలీసులు ఎప్పుడూ నిఘా ఉంచుతూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈ విధంగా దొరికిన ఆకతాయిలు చాలా మందేే ఉన్నారు.