తెలంగాణ ఎన్జీవో సంఘం నూతన అధ్యక్షుడిగా మామిడ్ల రాజేందర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో 33 జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు.. అధ్యక్షుడిగా రాజేందర్‌ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకుముందు కొనసాగిన కారెం రవీందర్ రెడ్డికి సోమవారం ఉద్యోగ పదవీ విరమణ పూర్తి అయింది. సంఘం ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన రాజేందర్ నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
టీఎన్జీవో 11వ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇచ్చి.. ఎన్నుకున్న 33 జిల్లాల అధ్యక్షులు, ఉద్యోగులందరికి రాజేందర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వంతో అరమరికలు లేకుండా పోరాటం చేస్తామని.. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీలు వెంటనే ఇవ్వాలని కోరారు. మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని విడుదల చేయడంతో పాటు ఆంధ్రలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలన్నారు. సీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలుస్తామని పేర్కొన్నారు.