Male and Female Genitalia in One Person :వైద్య పరిభాషలో అరుదైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ యురాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వై.ఎం.ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా పిల్లలు పుట్టలేదు. అందరిలానే ఉంటూ అన్ని పనులు చేసుకొని సాధారణ జీవితం గడపుతున్నాడు. ఈ క్రమంలో ఆయనకు పొత్తి కడుపులో కింద తీవ్రమైన నొప్పి వచ్చింది.
Persistent Müllerian Duct Syndrome :దీంతో సదరు వ్యక్తి స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన కిమ్స్ (KIMS) వైద్య బృందం.. అల్ట్రాసౌండ్ సహా వివిధ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో ఆయన పురుషాంగం సాధారణంగానే ఉన్నప్పటికీ వృషణాలు పుట్టినప్పటి నుంచి ఉదరభాగంలోనే ఉండిపోయి.. స్త్రీలలో మాదిరిగానే గర్భసంచి, ఫాలోపియన్ నాళం (Fallopian tube), స్త్రీ జననాంగంలోని కొంతభాగం అదే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న కిమ్స్ వైద్య బృందం.. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో లోపల ఉన్న వృషణాలు, ఫాలోపియన్ నాళం, గర్భసంచి, స్త్రీ జననాంగం సున్నితంగా తొలగించి విజయం సాంధించారు.
అరుదైన కేసు.. మన దేశంలో ఇప్పటి వరకు 20 కేసులు నమోదు : హార్మోన్ల ప్రభావం వలనే ఒకే వ్యక్తిలో స్త్రీ, పరుష పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందాయని ఆయనకు శస్త్ర చికిత్స చేసిన ... కిమ్స్ యురాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ వై.ఎం.ప్రశాంత్ తెలిపారు. సాధారణంగా స్త్రీ, పురుషులకు వేర్వేరు జననాంగాలు, పునరుత్పత్తి అవయవాలు ఉంటాయని.. కడుపులో పిండం ఏర్పడేటప్పుడు రెండు రకాల అవయవాలు ఉన్నా, ఆ తర్వాత హార్మోన్ల ప్రభావంతో ఏదో ఒకటే అభివృద్ధి చెందుతాయని తెలిపారు.