చాలామంది వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తారు. ఆ వయస్సులో ఎలా గడపాలా అని మధ్య వయస్సు నుంచే ఆలోచన మొదలుపెడుతుంటారు. కంటికి రెప్పలా పెంచి ప్రయోజకులను చేసినా కొందరు పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోని దుస్థితి. అయినవారి ఆదరణకు నోచుకోక కనీసం ఆశ్రమాల్లోనైనా ప్రశాంతత దొరుకుతుందని వెళ్తున్న వృద్ధులకు నిరాశే మిగులుతోంది. ఒకే గదిలో పదుల సంఖ్యలో కుక్కేసి నాసిరకం ఆహారం, అరకొర వైద్యసేవలతో దయనీయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
మహానగరంలో దాదాపు 200 వరకు ఎన్జీవోలు నిర్వహిస్తున్న ప్రైవేట్ వృద్ధాశ్రమాలున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నది ఒక్కటేనని, అందులో 30మంది ఆశ్రయం పొందుతున్నారనేది అధికారుల మాట. వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో దాదాపు 150మందికి అన్ని సౌకర్యాలతో వసతి కల్పించే ఆశ్రమం ఒకటి లేదా రెండైనా ఉండాలన్నది నిబంధన. ఎన్జీవోలు నిర్వహిస్తున్న ఆశ్రమాలనూ పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే.
పాఠం నేర్వలేదు..!
గతంలో నాగారం పరిధిలో వృద్ధాశ్రమం పేరిట ఓ స్వచ్ఛంద సంస్థ నిధులు దండుకుని మానసిక వైకల్యం ఉన్నవారిని గొలుసులతో నిర్బంధించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వృద్ధాశ్రమాల నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని ఇటీవల హైకోర్టు స్పష్టంచేసింది. ‘‘నగరంలోని మదర్స్‌నెస్ట్ వృద్ధాశ్రమంలో మూడు గదుల్లో 24మంది మహిళలు కిక్కిరిసి ఉండగా, సెకండ్ ఛాన్స్ ఆశ్రమంలో ఇరుకిరుకు గదుల్లో మంచాలున్నాయి.. చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు..’’ వీటి నిర్వహణపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.