కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత జైపాల్‌రెడ్డి(77) ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
జైపాల్‌రెడ్డి మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. జైపాల్ రెడ్డి మరణ వార్త విన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నివాసానికి వచ్చి.. పార్థివదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. ఈ తరానికి జైపాల్ రెడ్డి ఆదర్శనీయుడని కొనియాడారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి మరణించారన్న వార్త బాధ కలిగించిందని రాహుల్ పేర్కొన్నారు. తెలంగాణ,ఏపీ, మహారాష్ట్ర గవర్నర్లు జైపాల్ రెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
జైపాల్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి సంతాపం వ్యక్తం చేశారు. సీఎంలు కేసీఆర్,నారాయణ స్వామి ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి...కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉత్తమపార్లమెంటేరియన్‌గా, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్,ఈనాడు ఎండీ కిరణ్, ఇరు రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు కాంగ్రెస్, భాజపా, కమ్యూనిస్టు, ప్రజాసంఘాల నేతలు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.