Mahila Suraksha Sambaralu :తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ సురక్ష దివాస్ పేరుతో పోలీసులుసమాజంలో శాంతి భద్రతలపై చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద మహిళా సురక్ష సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కవిత, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సినీ నటుడు నాని,టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Telangana Decade Celebrations :సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పోలీసుల సేవలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. దేశంలోనే షీ టీమ్స్ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. దేశంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆదర్శంగా నిలుస్తోందని.. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సత్యవతి రాఠోడ్ ఆకాక్షించారు.
Kavitha in Suraksha Diwas Celebrations :దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు అనేక అపోహలు ఉండేవని పేర్కొన్నారు. భద్రత ఉండదు, రౌడీల రాజ్యంగా మారుతుందని దుష్ప్రచారం జరిగిందని చెప్పారు. కానీ ఆ అపోహలను పటాపంచలు చేస్తూ కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత.. రాష్ట్ర పోలీసులకే దక్కుతుందని వివరించారు. గత 9 ఏళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదని, ఒక్క మతకల్లోలం ఘటన జరగలేదని కవిత వెల్లడించారు.