Mahesh Bank Fined Rs 65 Lakh By RBI : ఇళ్లల్లోకి వెళ్లి చోరీలు చేయడం, దారిపోయిన వ్యక్తిని కొట్టి దోపిడీ చేసి డబ్బులు లాక్కెళ్లడం ఒకప్పటి మాట. ఎక్కడో వేరే దేశాల్లో ఉండి నగదును మాయం చేయడం నేటి విధానం. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ ఇక్కడ మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నమ్మించి.. ఓటీపీ తెలుసుకొని ఖాతాలో సొమ్ము మాయం చేయడం, లేదా పలు అప్లికేషన్లు డౌన్లోడ్ చేయించి వాటి సాయంతో ఏకంగా బ్యాంకు ఖాతాలను తమ అధీనంలోకి తీసుకోవడం సైబర్ నేరగాళ్ల ప్రత్యేకత.
గతేడాది జనవరి 24వ తేదీన సైబర్ నేరగాళ్లు మహేశ్ కోఆపరేటివ్ బ్యాంకును లక్ష్యంగా చేసుకొని హ్యాకింగ్ చేశారు. అందులో పనిచేసే సిబ్బంది కంప్యూటర్లకు పలుమార్లు ఫిషింగ్ మెయిల్స్ పంపించారు. సిబ్బంది మెయిల్స్ ఓపెన్ చేసి చూడగానే బ్యాంకు ప్రధాన సర్వర్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు సర్వర్లోకి వెళ్లి బ్యాంకు ప్రధాన ఖాతాలో నుంచి రూ.12.48 కోట్లును ఇతర ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ప్రతినిధులు గుర్తించి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సైబర్ నేరగాళ్లకు సహకరించిన మహేశ్ బ్యాంకు ఖాతాదారులతో పాటు దిల్లీ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ముంబయి, బెంగళూర్లలో పలు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వాళ్లను కూడా సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.