Teacher MLC Votes Counting Update : తెలంగాణలో నిర్వహించిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా వెల్లడించారు. ఏ అభ్యర్థికి 50శాతం కంటే ఎక్కువ రానందున రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టినట్లు ప్రియాంక అలా తెలిపారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 7,505, చెన్నకేశవ రెడ్డికి 6,584 ఓట్లు వచ్చాయని ఆర్వో ప్రియాంక ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 921 ఓట్ల మెజారిటీ వచ్చిందని... 452 ఓట్లు చెల్లలేదని ప్రియాంక అలా తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తున్నామని ఆర్వో వివరించారు. విజేత గెలుపునకు మ్యాజిక్ ఫిగర్ 12,709 ఓట్లు పొందాలని ఆర్వో ప్రియాంక తెలిపారు. మొత్తం మూడు షిప్టుల్లో ఎన్నికల లెక్కింపు సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రేపు ఉదయానికల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రియాంక స్పష్టం చేశారు.
ప్రధాన పోటీ వీరి మధ్యే :సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంట్లో భాగంగా ఏడుగురు అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. ఏవీఎన్ రెడ్డికి 7,543, చెన్నకేశవ రెడ్డికి 6,599 ఓట్లు వచ్చాయి. 7గురి ఎలిమినేషన్ ప్రక్రియ అనంతరం 944 ఓట్ల మెజారిటీతో ఏవీఎన్ రెడ్డి ముందజలో ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 25,416 ఓట్లను లెక్కించారు. మొత్తం ఈ ఎన్నికలో 21 మంది పోటీ పడగా.. ప్రధాన పోటీ మాత్రం ఏవీఎన్‌రెడ్డి, చెన్నకేశవ రెడ్డి మధ్య నెలకొంది. తర్వాత పాపన్నగారి మాణిక్‌రెడ్డి 4594 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బీరం హర్షవర్ధన్ రెడ్డి, ప్రస్థుత ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్ రెడ్డి తదుపరి స్థానాలలో ఉన్నారు.
కొనసాగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గానికి మార్చి 13న పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలోని మొత్తం తొమ్మిది జిల్లాల్లో సుమారు 29,720 మంది ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఈ ఎన్నికలో పోలింగ్ శాతం 90.40గా నమోదైంది. మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేసి లెక్కింపు కొనసాగిస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి 50 శాతంకు పైగా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
ఇవీ చదవండి: