తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ 150: మహాత్ముడు వాడిన వస్తువు...  వేటపాలెం గ్రంథాలయంలో! - పేరాల ఉద్యమం

స్వాతంత్య్ర పోరాటంలో దేశమంతా పర్యటిస్తూ.. మహాత్ముడు అనేక  ప్రాంతాలకు వచ్చారు. ఆంధ్రరాష్ట్రంలో ఉధృతంగా జరిగిన చీరాల - పేరాల ఉద్యమాన్ని  ప్రోత్సహించేందుకు ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ పురాతన గ్రంథాలయం వేటపాలెం సారస్వతినికేతనానికి మహాత్మడే శంకుస్థాపన చేశారు. గాంధీజీ బాగా ఉపయోగించిన వస్తువు ఆ లైబ్రరీలో ఇప్పటికీ భద్రంగా ఉంది.

మహాత్ముడు వాడిన వస్తువు...  వేటపాలెం గ్రంథాలయంలో!

By

Published : Sep 26, 2019, 8:08 AM IST

మహాత్ముడు వాడిన వస్తువు... వేటపాలెం గ్రంథాలయంలో!

మహాత్ముడి పిలుపునందుకుని.. యావత్ దేశమే.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంది. అందులో.. తెలుగు నేలది ప్రత్యేక స్థానం. గాంధీ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఇక్కడ అనేక చోట్ల ఉద్యమాలు జరిగాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది.. చీరాల పేరాల ఉద్యమం.

1929లో...

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీరాల... పోరాటాల పురిటిగడ్డ. స్వాతంత్రోద్యమం ఊపందుకున్న రోజుల్లో బ్రిటిష్ పాలకులు పన్నులు కట్టాలని హుకుం జారీ చేశారు. రొక్కం కట్టే ప్రసక్తే లేదని... ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చీరాల - పేరాల ఉద్యమం ప్రారంభించారు. ఊరు ఖాళీ చేసి... చీరాల సమీపంలో గుడిసెలు వేసుకుని తెల్ల దొరలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న గాంధీజీ 1929లో ... చీరాల శివాలయం ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేశారు. వేలాదిమంది ఉద్యమకారులు హాజరయ్యారు. బాపూజీ సమావేశం నిర్వహించిన ప్రదేశంలో... నల్ల రంగులో ఉండే గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది చీరాల పట్టణంలో నల్లగాంధీ కూడలిగా పేరొందింది.

రెండు సార్లకు చీరాలకు..

1929,1935 సంవత్సరాల్లో గాంధీజీ రెండు సార్లు చీరాల ప్రాంతానికి వచ్చారు. 1918లో వేటపాలెంలో వి.వి. శ్రేష్టి నిర్మించాలనుకున్న సారస్వతనికేతనం భవనానికి 1929లో మహాత్ముడు శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో జాతిపితను చూసేందుకు ప్రజలు అధికసంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి... గాంధీజీ చేతి కర్ర విరిగిపోయింది. బాపూ ఆ కర్రను అక్కడే వదిలివెళ్లారు. జాతిపిత చేతికర్ర ఇప్పటికీ గ్రంథాలయంలో భద్రంగా ఉంది.

గ్రంథాలయంపై గాంధీజీ..

గ్రంథాలయం గురించి గాంధీజీ స్వదస్తూరితో రాసి సంతకం పెట్టారు. ఇక్కడ మహాభారతం, భాగవతం, బాపూజీ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాలున్నాయి. అంతేకాకుండా... 1940 ఏడాది ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ దినపత్రికలు ఇప్పటివరకూ ఉన్నాయి. అనేక అరుదైన పుస్తకాలున్న వేటపాలెం గ్రంథాలయం అనేకమంది పరిశోధకులకు రిఫరెన్సుగా ఉపయోగపడుతోంది.

ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

ABOUT THE AUTHOR

...view details