తెలంగాణ

telangana

ETV Bharat / state

Maha Shivratri 2022 : శంభో శివ శంభో.. శివశివ శంభో - Mahashivratri 2022 in Telangana

Maha Shivratri 2022 : మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రధాన శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. దేవాలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు.. భోళా శంకరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అభిషేకాలు, కోడెమొక్కులతో భక్తి పారవశ్యంలో మునిగితేలారు. శైవాలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి.

Mahashivratri 2022: శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు..
Mahashivratri 2022: శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు..

By

Published : Mar 2, 2022, 7:12 AM IST

శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు..

Maha Shivratri 2022 : మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరహర మహదేవ.. అంటూ శివనామస్మరణలతో మార్మోగాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. మహా శివరాత్రి పర్వదినాన శ్రీశైలం.. భక్తులతో కిటకిటలాడింది. అర్ధరాత్రి స్వామి, అమ్మవారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారికి మహన్యాసకపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ చేశారు. లక్షలాది భక్తుల ఓంకార నాదంతో శ్రీశైల గిరులు ప్రతిధ్వనించాయి.

రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తజనం

Maha Shivratri 2022 in Telangana : దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తజనం పోటెత్తారు. రాష్ట్రప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తితిదే తరఫున కూడా పట్టువస్త్రాలు అందజేశారు. అద్దాలమండపంలో అనువంశిక అర్చకులు మహాలింగార్చనను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి జాతరకు 2 లక్షలకు పైగా భక్తులు వచ్చారని అధికారులు అంచనావేశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన యాత్రికులు రాత్రంతా వేములవాడ రాజన్న క్షేత్రంలోనే జాగరణ చేశారు. ఉపవాస దీక్ష చేస్తూనే దీపాలు వెలిగిస్తూ పరమేశ్వరుడిపై భక్తిని చాటుకున్నారు. గుడి చెరువులో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆద్యంతం అలరించాయి.

కాళేశ్వరంలో వైభవంగా ముక్తీశ్వర కల్యాణం

shivratri 2022 in Telangana : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ముక్తీశ్వరా శుభానందదేవిల కల్యాణం వైభవంగా నిర్వహించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్​ నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

అట్టహాసంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర

మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలో ఏడుపాయల వనదుర్గామాత జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి హరీశ్‌రావు దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో మంత్రి తలసాని దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వేయిస్తంభాల ఆలయంతో పాటు కురవి, పాలకుర్తి దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కుటుంబ సమేతంగా కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి, నల్గొండ జిల్లా పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయం, నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details