తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. శివ నామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగాయి. అధిక సంఖ్యలో ఆలయాలకు తరలొచ్చిన భక్తులు... జాగరణ చేసి నీలకంఠుడిని మనసారా వేడుకున్నారు. అనంతరం మొక్కులు సమర్పించుకున్నారు.
రాజన్నను దర్శించుకున్న భక్తులు
వేములవాడ రాజరాజేశ్వర స్వామికి భక్తజనం నీరాజనం పలికారు. శివస్వాములు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వాములు శివదీక్ష మాల విరమించారు. అనువంశిక అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణమండపంలో మహాలింగార్చన వేడుకగా జరిగింది. ఆరుగురు పీఠాధిపతులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు బ్రహ్మరథం పట్టారు.
కీసరలో గవర్నర్ పూజలు
కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి వారిని గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సాదరంగా ఆహ్వానించి తీర్ధప్రసాదాలు అందించారు. ముఖ్యమంత్రి మనవడు హిమాన్షు రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్న హిమాన్షుకు... ఆలయ అధికారులు శాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు.
ఇల కైలాసం దిగివచ్చెనంటా..!
సిద్దిపేటలో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన అనుభూతి కలిగేలా భారీ సెట్టింగులతో ఆలయం ఏర్పాటు అద్భుతమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమర్‌నాథ్ మంచు శివ లింగాన్ని దర్శించుకున్నారు.
ఓరుగల్లులో అంబరాన్నంటిన సంబురాలు
హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో ఇండస్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటాయి. ముఖ్యఅతిథిగా హాజరైన సినీనటుడు తనికెళ్ల భరణి శివకీర్తనలు ఆలపించారు. ఓరుగల్లు కళా వైభవం, శివతత్వం చాటేలా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అలరించాయి. పేరిణి శివతాండవం లింగార్చన, తనికెళ్ల భరణి ఆట కదరా శివ కీర్తనలు ఆధ్యాత్మిక శోభను పంచాయి. లింగోద్భవ సమయంలో సప్తహారతిని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని స్వయంభూ లింగేశ్వర ఆలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీలు సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ మంత్రి వెంట ఉన్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు, శివరాత్రి ప్రభల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది.
ఇవీ చూడండి:మహిళా భద్రతకు పోలీసుల సరికొత్త 'అస్త్రం'!