Srisailam Brahmotsavam: ఏపీలోని శ్రీశైలం మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.46 గంటలకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, ఈవో ఎస్ లవన్న, అర్చకులు, వేద పండితులు యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. శివ సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవచనం, చండీశ్వర పూజ, కంకణ పూజలను నిర్వహించి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి 7 గంటలకు మల్లికార్జున స్వామి ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించనున్నారు. బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం చైర్మన్, ఈవో తెలిపారు.
స్టీమ్ బాయిలర్ పేలుడు:శ్రీశైలంలోని దేవస్థానం అన్నపూర్ణ భవన్లో స్టీమ్ బాయిలర్ మరోసారి పేలింది. ఇవాళ ఉదయం భక్తులకు భోజనం తయారు చేసే క్రమంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా విజయవాడ నుంచి కొందరు భోజనాలు తయారు చేసేందుకు కాంట్రాక్టు కింద పనిచేయడానికి శ్రీశైలం వచ్చారు. వారు బాయిలర్ వద్ద ఉండగా ఒక్కసారిగా పేలిపోయింది. బాయిలర్లోని వేడి నీళ్లు పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక బాలుడికి గాయాలు అయ్యాయి.