మహాశివరాత్రి వేడుకలకు శ్రీశైల మల్లన్న ఆలయం ముస్తాబయింది. జ్యోతిర్లింగ క్షేత్రంలో శివరాత్రి సందర్భంగా ఆదిదేవుడిని కనులారా వీక్షించేందుకు భక్తకోటి తరలివస్తోంది. పంచాక్షరి మంత్రంతో కైలాసగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. తీర్చిదిద్దిన విద్యుల్లతాకాంతులు, విశిష్ట అలంకరణలు శ్రీగిరిని దేదీప్యమానం చేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడో రోజైన గురువారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు భక్తులకు గజవాహనంపై దర్శనమిచ్చారు.
ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం మంగళవాద్యాలు, కళాకారుల సందడి నడుమ శ్రీస్వామి అమ్మవార్లను గ్రామోత్సవానికి తీసుకువచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం ప్రభోత్సవం జరగనుంది.