Home Minister on Spurious Seeds : నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు అధికారులు అప్రమత్తతో సమాచారాన్ని సేకరించి కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ,డీజీపీ అంజనీ కుమార్ తదితర అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతోనూ, పోలీస్ కమిషనర్లతోను మాట్లాడారు. వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే అన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు వ్యవసాయ శాఖ, ఇంటెలిజెన్స్ సిబ్బందితో సమాచారం సేకరించి నకిలీ విత్తన విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలని హోం మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ప్రయోజన పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్న తరుణంలో వారు నకిలీ విత్తనాల విక్రయ దారుల బారిన పడకుండా ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఎన్నో విజయాలను సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఈ విషయంలోనూ పోలీసు అధికారులు వ్యవహరించి నకిలీ విత్తనాలను అరికట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు రాష్ట్రంలోని రైతులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను హోం మంత్రి వివరించారు.