Mahalakshmi Scheme in Telangana 2023 :రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి 9వేలకు పైగా బస్సులు ఉన్నాయి. ఇందులో 50వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ బస్సులు సుమారు 10వేల గ్రామాల్లో 35 లక్షల కిలోమీటర్ల వరకు నిత్యం ప్రయాణిస్తుంటాయి. దాదాపు 45 లక్షల మందిని ప్రతిరోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. కానీ ఇటీవల ప్రభుత్వం మహాలక్ష్మి(Mahalakshmi Scheme) పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది.
Mahalakshmi Scheme Effect On Male Passengers in Telangana : ఈ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఏ బస్సులు చూసినా మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దీంతో టిక్కెట్టు తీసుకున్న వారి పరిస్థితి ఇబ్బందిగా మారిపోతుంది. సాధారణ సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారు. టికెట్లు తీసుకుని కూడా తాము నిల్చొని ప్రయాణించాల్సి వస్తోందని కొందరు వ్యక్తులు కండక్టర్లతో వాగ్వాదానికి దిగిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో "కరవు మంటే కప్పకు కోపం - విడువు మంటే పాముకు కోపం" అన్న చందంగా కండక్టర్ల పరిస్థితి తయారైంది. అయితే ఈ ఘటనలను కండక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
మహాలక్ష్మి పథకాల అమలుపై ప్రజల హర్షాతిరేకాలు - జేబీఎస్లో సజ్జనార్ పరిశీలన
3 Crore Women Travel In 11 Days : మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ప్రతి రోజూ సగటున 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మొత్తంగా రోజూ 51 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చుతోంది. పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో 62 శాతం మంది మహిళలే ఉన్నారని యాజమాన్యం వెల్లడించింది. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా సంస్థ ఆక్యూపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. గతంలో 69 శాతం ఓఆర్ ఉండగా ప్రస్తుతం అది 88 శాతానికి పెరిగింది.