mahabubnagar adulterated liquor : మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లుతో ముగ్గురు మృతి, 42 మంది అస్వస్థతకు దారి తీసిన కారణాలేమిటో పూర్తి వివరాలు సమర్పించాలని ఎక్సైజ్‌శాఖను హైకోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లుతో 42మంది అస్వస్థతకు గురయ్యారని.. వారిలో ముగ్గరు మృతి చెందగా.. మరొకరు గాయపడినట్లు ఏప్రిల్ 13న ఈనాడు కథనం ప్రచురితమైంది.
ఈనాడు కథనం ఆధారంగా విచారణ జరిపి బాధ్యులైన కల్లు దుకాణం నిర్వాహకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన సామాజిక కార్యకర్త సీహెచ్ అనిల్ కుమార్ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు లేఖ రాశారు. ఈనాడు కథనాన్ని సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు.. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే.. మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం సృష్టించింది. కల్తీ కల్లు తాగి ముగ్గురు మృతి చెందడంతో పాటు దాదాపు 42 మంది ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ జిల్లా కోడెరుకు చెందిన ఆశన్న, జిల్లా కేంద్రానికి చెందిన విష్ణుప్రకాశ్తో పాటు కోడూరు గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ మృతి చెందింది.