నేటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైల క్షేత్రానికి రవాణా సౌకర్యాలు లేని రోజులవి. దట్టమైన అడవుల్లో, నల్లమల కనుమల్లో ప్రయాణం. వందల మైళ్ల దూరం కాలినడకనే వచ్చేవారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల పాదాల వద్దకు చేరుకోగానే నాలుగు ప్రధాన మార్గాలు ఆహ్వానం పలికేవి.
శిఖరేశ్వరంమార్గం: తీరాంధ్ర ప్రాంతం నుంచి ప్రజలు శ్రీశైలానికి తూర్పుద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం చేరుకునేవారు.యర్రగొండపాలెం, వేంకటాద్రిపాలెం, గంజివారిపల్లి, దుద్దనల నాగూరు మీదుగా తెలగవారి చెరువు వచ్చేవారు. కొండ మార్గంలో చింతల, పెద్ద ఆరుట్ల,, చిన్న ఆరుట్ల దాటి శిఖరేశ్వరంలో వీర శంకరస్వామిని సేవించుకునేవారు. అక్కడి నుంచి ముందుకు వెళ్లలేనివారు నంది కొమ్ముల నుంచి ఆలయాన్ని దర్శించుకుని వెనుతిరిగేవారు. అందువల్లనే శ్రీశైల శిఖరం దర్శించినంతనే పునర్జన్మ ఉండదనే భావన ప్రచారం చెందినట్లు చెప్పొచ్చు.
భీమునికొలను మార్గం: రాయలసీమ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం దక్షిణద్వారమైన సిద్ధవటం నుంచి, మరికొందరు పశ్చిమ ద్వారమైన అలంపురం నుంచి బయలుదేరి నంద్యాల, ఆత్మకూరు, కృష్ణాపురం, వెంకటాపురం, సిద్దాపురం మీదుగా నాగలూటి వచ్చేవారు. భీముని కొలను ద్వారా కైలాసద్వారం చేరుకొని ఆలయాన్ని చేరుకుని స్వామిని దర్శించేవారు. ఇది ఆ రోజుల్లో అత్యంత ప్రసిద్ధిచెందిన మార్గం.
నీలిగంగ మార్గం:నాగర్ కర్నూల్, అమ్రాబాద్, తెలకపల్లి మీదుగా ప్రయాణం చేసే తెలంగాణ ప్రాంత ప్రజలు మొదట శ్రీశైల ఉత్తరద్వారంగా ప్రసిద్ధి చెందిన ఉమామహేశ్వరం చేరుకునేవారు. అటవీ ప్రాంతంలో అప్పాపురం, భ్రమరాంబచెరువు, మేడిమాకుల, సంగడిగుండల మీదుగా నీలిగంగరేవుకు వచ్చేవారు. అక్కడ తెప్పల ద్వారా కృష్ణా నదిని దాటి చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకొని స్వామిని దర్శించేవారు.
జాతరరేవు మార్గం:ఇది కూడా ఉమామహేశ్వరం నుంచే ప్రారంభమవుతుంది. భ్రమరాంబచెరువు, మేడిమాకుల చేరుకొని అక్కడ నుంచి అక్కగని వద్దకు వచ్చి కృష్ణా తీరంలోని జాతర రేవును దాటుకొని చుక్కల పర్వతాన్ని ఎక్కి శ్రీశైలం చేరుకునేవారు.
ఈ ప్రయాణం అత్యంత కఠినమైంది కాబట్టే సాధారణ ఆలయాల్లో ఉండే విధివిధానాలు ఇక్కడ పాటించనవసరం లేదు. సాధారణంగా దైవ దర్శనానికి శుచీ శుభ్రతలను పాటిస్తూ వెళ్ళడం ఆచారం. అటువంటివి ఏమీ లేకుండా ఈ క్షేత్రానికి చేరుకుని ఆతృతగా స్వామి వారి వద్దకు వెళ్లి తమ ఆత్మీయులను ఆలింగనం చేసుకుని పలకరించినట్టుగా స్వామి వారిని తాకి, దర్శించే ఆచారం ఏర్పడింది. వందలాది మైళ్లు కాలినడకన ప్రయాణిస్తూ మార్గమధ్యంలో క్రూరజంతువుల నుంచి, అటవికుల నుంచి తమను తాము కాపాడుకుంటూ... ‘చేదుకో మల్లన్న..దరి చేర్చుకో మల్లన్న’ అంటూ స్వామి వారిని ప్రార్థిస్తూ క్షేత్రానికి చేరుకొని ముందుగా స్వామిని స్పర్శించి దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. అంతేకాకుండా మార్గమంతా తమతో పాటే ఉండి, రక్షించి తనవద్దకు చేర్చుకున్నందుకు కృతజ్ఞతతో, ఉద్వేగంతో శ్రీశైలం చేరుకున్న వెనువెంటనే వెళ్లి మల్లికార్జునుడిని దర్శించుకునే వారు. అందువల్లనే ఈ విధమైన ఆచారం ఏర్పడినట్లు చెప్పవచ్చు. మరే క్షేత్రంలోనూ ఇలాంటి అవకాశం లేదు.
- ఐఎల్‌ఎన్‌చంద్రశేఖరరావు,యలమంచిలి రమా విశ్వనాథన్
నాలుగు యుగాల్లో...
శ్రీశైల క్షేత్ర మహాత్మ్యం ఈనాటిది కాదు. యుగయుగాల నుంచి ఎందరో మహానుభావులు ఇక్కడ మల్లికార్జునస్వామిని దర్శించి సేవించినట్లు చెబుతారు. శ్రీశైల ఖండంతో పాటు, వివిధ పురాణాల్లోనూ ఈ విశేషాలున్నాయి...