రాష్ట్రవ్యాప్తంగా మహాశివరాత్రి పండుగ కోసం శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. కొన్ని చోట్ల ఇప్పటికే ఉత్సవాలను ప్రారంభించారు. భక్తుల సందర్శనార్థం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. గోదావరినదిలో భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు వీలుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు వదిలారు.
ప్రత్యేక బస్సులు
శివరాత్రి పర్వదినాన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో అధికారులు ప్రత్యేకంగా 35 బస్సులను ఏర్పాటు చేశారు. పిల్లలకు రూ.50, పెద్దలకు రూ.95గా టికెట్ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. కేవలం మెట్పల్లి నుంచే ప్రతి ఏటా సుమారు 10వేల మంది భక్తులు వేములవాడ జాతరకు వెళ్తారని అధికారులు తెలిపారు. బస్టాండులో తాగునీటి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఎండలో ఉండకుండా నీడ కోసం టెంట్లను సైతం ఏర్పాటు చేశారు. రాజన్న జాతర వేడుకల కోసం అధికారులు రూ. 1.5 కోట్లతో ఏర్పాట్లు చేపట్టారు.
పుణ్యస్నానాల కోసం నీటి విడుదల
మహాశివరాత్రిని పురస్కరించుకుని గోదావరినదిలో భక్తులు పుణ్యస్నానాలు చేయడం సంప్రదాయంగా మారింది. ప్రస్తుతం గోదావరి నదిలో ఎక్కువగా నీళ్లు లేనందున పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నుంచి 7, 8వ నెంబరు గేట్లు ఎత్తి దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువన ఉన్న పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదీప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లకూడదని తెలిపారు.
తాగనీరు, చలువ పందిళ్ల ఏర్పాటు
వరంగల్ పట్టణంలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజులపాటు జరిగే మహాశివరాత్రి వేడుకలను రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ , వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎండలు బాగా కాస్తున్నందున చలువ పందిళ్లు, చల్లటి తాగునీటి ఏర్పాట్లు చేశారు.
ప్రాథమిక చికిత్స కేంద్రాల ఏర్పాటు
ములుగు జిల్లాలోని పాలంపేట రామప్ప దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేకంగా పోలీసు, వైద్య సిబ్బంది సేవలందించనున్నారు. ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని భక్తులు తెలిపారు. రేపు ఉదయం నాలుగున్నర గంటలకు సుప్రభాతం, 6 గంటలకు గణపతి పూజ, అఖండదీపారాధన, పుణ్యాహవాచనము, అంకురార్పణ, రక్షాబంధనం, సామాజిక రుద్రాభిషేకములు నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనుంది.
విద్యుద్దీపాల వెలుగులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పలు మండలాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి నాడు ఇక్కడ వందల సంఖ్యలో భక్తులు బస చేసి ఉపవాస దీక్షలను విరమిస్తారు. రాత్రంతా జాగారం, శివారాధన, దీపారాధన కార్యక్రమం కొనసాగుతుంది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా బారికేడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. శివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేకంగా రంగులద్దారు. వర్ణశోభిత విద్యుద్దీపాలను అలంకరించారు.
ఇవీ చదవండి:నీటి విడుదల