తెలంగాణ

telangana

ETV Bharat / state

child trafficking: పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!

‘‘కొవిడ్‌ సోకి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని చేరదీస్తున్నాం. వారు జీవితంలో స్థిరపడేంత వరకు అయ్యే ఖర్చులను మేమే భరించాలనుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమంలో మీరూ పాలుపంచుకొని ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంటారని ఆశిస్తున్నాం.’’ ‘‘కరోనా కారణంగా అనాథలుగా మారిన పిల్లలను దత్తత తీసుకుంటాం. ఆర్ధిక స్థోమత సరిగా లేని పిల్లలకు విద్య చెప్పించి, పూర్తి సహకారం అందిస్తాం’’ అంటూ కొందరు మాయగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!
పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!

By

Published : Jun 4, 2021, 8:45 AM IST

అనాథ పిల్లలను ఆదుకుంటామంటూ ఎన్నో ప్రకటనలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మానవత్వంతో స్పందించిన కొందరు ఆ సంస్థలకు ఆన్‌లైన్‌ ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారి అయినవారిని, ఆత్మీయులను దూరం చేస్తోంది. చేయూతనివ్వాల్సిన ఇలాంటి సమయాన్ని మాయగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి చిన్నారుల నిస్సహాయతను అవకాశంగా మలచుకుంటున్నారు. బాలబాలికలను ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేసేందుకు సిద్ధపడుతున్నారని స్వచ్ఛంద సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నిస్సహాయ పరిస్థితుల్లో చిన్నారులు ఇటువంటి వారి బారినపడకుండా ఉండేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సహాయక కేంద్రం ద్వారా పిల్లల వివరాలు సేకరించి వారిని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తోంది.
అసలేం జరుగుతుందంటే?
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. ఈ పరిస్థితినే మోసగాళ్లు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఫేస్‌బుక్‌/వాట్సాప్‌/ట్విటర్‌/ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకునే ప్రకటనలు ఇస్తున్నారు.

స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల ద్వారా తాము దత్తత తీసుకుంటామని, అటువంటి పిల్లల వివరాలు చెప్పాల్సిందిగా కోరుతున్నారు. వారికి విద్యాబుద్ధులు చెప్పిస్తామంటూ నమ్మకం కలిగిస్తున్నారు. వాస్తవానికి వ్యక్తులు/స్వచ్ఛంద సంస్థలు అనాథ పిల్లలను దత్తత తీసుకునే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ‘సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా)’ ద్వారా నిబంధనలకు అనుగుణంగా దత్తత ఇస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. నిబంధనల మేరకు ఉన్నతాధికారులు పరిశీలించిన తరువాతే దత్తత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి చిన్నారులను సంతానలేమితో బాధపడే దంపతులు దత్తత తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. యూసుఫ్‌గూడలో స్టేట్‌హోం ప్రాంగణంలో శిశువిహార్‌ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఉంది.
అక్రమ రవాణాకు అవకాశం
అనాథ పిల్లల దత్తత ముసుగులో మానవ అక్రమ రవాణాకు కొన్ని ముఠాలు ప్రయత్నిస్తున్నాయని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్‌ ట్విటర్‌ ద్వారా హెచ్చరించారు. ఇటువంటి ప్రకటనలను నమ్మొద్దని సూచించారు. తల్లిదండ్రులు కోల్పోవటం, పేదరికం కారణాలతో నగరం చేరిన బాలబాలికలను మాఫియా సభ్యులు చేరదీసి, పరిశ్రమలు, భిక్షాటన, వ్యభిచారం తదితర కార్యక్రమాల్లోకి దింపుతున్నారు. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో అనాథలుగా మారిన పిల్లలను చేరదీసి మాఫియా సూత్రధారులు డబ్బుచేసుకొనే ప్రమాదముంది. దీనికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో అనాథ పిల్లల వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ, ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా సేకరిస్తోంది. వారిని నగరంలోని సంరక్షణ కేంద్రంలో ఉంచి బాగోగులు చూస్తోందని హైదరాబాద్‌ జిల్లా సంక్షేమశాఖాధికారి అక్కేశ్వరరావు తెలిపారు. ఇటువంటి చిన్నారుల వివరాలను కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ నెంబరు 040-2373 3665 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలు), చైల్డ్‌లైన్‌ నంబర్‌ 1098కు 24 గంటలు తెలియజేయవచ్చని సూచించారు.

ఇదీ చూడండి: మీ చిన్నారులు ఏం చూస్తున్నారో.. ఓ కన్నేయండి!

ABOUT THE AUTHOR

...view details