200 Senior Political Leaders from Madhya Pradesh joined in BRS :భారత్ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ మాత్రమే కాదని, దేశాన్ని మార్చడానికి ఏర్పాటు చేసిన మిషన్ అని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తాత, తండ్రి, పార్టీ వ్యవస్థాపకులు, సిద్ధాంతకర్తల పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇక చెల్లదన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో ఆదివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. జున్నార్‌దేవ్ మాజీ ఎమ్మెల్యే రామ్‌దాస్, సర్వజన్ కల్యాణ్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, గోండ్వానా పార్టీ అధ్యక్షుడు శోభారామ్ బాలావి, తదితర సుమారు 200 మందికి ప్రగతిభవన్‌లో కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మధ్యప్రదేశ్ నేతలకు ఆయన వివరించారు.
KCR about BRS Party Latest News :ఈ సందర్భంగా త్వరలోనే భోపాల్‌లో బీఆర్‌ఎస్‌కు సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేసీఆర్ మధ్యప్రదేశ్ నేతలతో తెలిపారు. ప్రజలు కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా..తమ ఆకాంక్షలను గెలిపించుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కేంద్రంలోని పాలన దేశ లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పాలకులకు లక్ష్య శుద్ధి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయమన్నారు. ఒక పార్టీని ఓడించి మరో పార్టీని గెలిపిస్తే.. పేర్లు మారుతాయి కానీ, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు.
మేధావి వర్గం కలిసి రావాలి.. : ఈ క్రమంలోనే పని విధానంలో మార్పు తెచ్చే ప్రభుత్వాలను.. ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని కేసీఆర్ పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితిని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేశ ప్రజలకు, రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. దేశం మార్పు కోరుకుంటోందని.. ఈ దిశగా మేధావి వర్గం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి రావాలని కేసీఆర్ కోరారు.
'త్వరలోనే భోపాల్‌లో బీఆర్‌ఎస్‌కు సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రజలు కేంద్రంలో పార్టీలను మార్చడం కాకుండా.. తమ ఆకాంక్షలను గెలిపించుకోవాలి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా కేంద్రంలోని పాలన దేశ లక్ష్యాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాలకులకు లక్ష్య శుద్ధి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం శోచనీయం. ఒక పార్టీని ఓడించి మరో పార్టీని గెలిపిస్తే.. పేర్లు మారుతాయి కానీ, ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. పని విధానంలో మార్పు తెచ్చే ప్రభుత్వాలను.. ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. భారత్ రాష్ట్ర సమితిని గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే దేశ ప్రజలకు, రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తాం. దేశం మార్పు కోరుకుంటోంది. ఈ దిశగా మేధావి వర్గం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కలిసి రావాలి.' - కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, బీఆర్‌ఎస్ అధినేత