Madhapur Drug Case at Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన మాదాపూర్ డ్రగ్స్ కేసు(Madhapur Drugs Case)లో రోజుకో కొత్త ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. తాజాగా ఈ డ్రగ్స్ కేసు(Drug Case)లో ముగ్గురు నిందితులు, గుడి మల్కాపూర్ పోలీసు స్టేషన్‌లోని పోలీసుల ఎదుట హాజరయ్యారు. కలహార్ రెడ్డి, స్నాట్ పబ్ యజమాని సూర్య, హిటాచి సాయి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ముగ్గురిని ప్రశ్నించిన పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేసి పంపించారు. గుడిమల్కాపూర్ పోలీసులు ముగ్గురినీ మాదక ద్రవ్యాల వినియోగదారులుగా చేర్చారు. దీంతో ముగ్గురూ హైకోర్టుకు వెళ్లి పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు.
పోలీసు విచారణకు సహకరించాలని, ప్రతి సోమవారం పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని హైకోర్టు(Telangana High Court) ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ముగ్గురూ గుడిమల్కాపూర్ పీఎస్‌కు వచ్చారు. వచ్చే వారం మరోసారి పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించారు. ముగ్గురు నిందితులు డ్రగ్స్‌ను ఎవరెవరి వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారని నార్కోటిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
New Twist in Madhapur Drus Case :హైకోర్టు ఆదేశాల మేరకు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయానని డ్రగ్స్ కేసు నిందితుడు కలహర్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుతో సంబంధం లేదని.. అందుకే హైకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఈ డ్రగ్స్ కేసులో తన పేరును మీడియాలో చూసిన తర్వాతే తెలిసిందని తెలిపారు. నార్కోటిక్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని వెల్లడించారు. నా ఫోన్‌లో వేల కాంటాక్టు నంబర్స్ ఉన్నాయని.. అందులో దొంగలు, మంచివాళ్లు ఉన్నారని వివరించారు. నా కాంటాక్టు లిస్ట్‌లో ఉన్నవాళ్లలో కొందరు డ్రగ్స్ కంజ్యూమర్స్ ఉన్నారని చెప్పారు. అందుకే తన పేరు కూడా లిస్ట్‌లో చేర్చినట్లు తెలిపారు. తనకు ఈ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటివరకు విచారణకు పూర్తిగా సహకరించానన్నారు. ఇక ముందు కూడా సహకరిస్తానని.. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.