All Temples Will Closed in Telangana Due to Lunar Eclipse : శనివారం రాత్రి రాహుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ( Lunar Eclipse) ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం.. నేటి అర్ధరాత్రి దాటిన తర్వాత 01:05 గంటలకు ప్రారంభమై.. 02:22 గంటలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి (Yadadri Sri Lakshmi Narasimha Swami) దేవాలయాన్ని ఈరోజు సాయంత్రం 4:00 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల వరకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Kondagattu Temple Closed Due to Lunar Eclipse :జగిత్యాల జిల్లాలోని అంజన్న ఆలయాన్ని (Kondagattu Temple) ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రేపు ఉదయం 5:00 గంటల వరకు మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం ఉదయం ఆలయ సంప్రోక్షణ తర్వాత భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయని అన్నారు. మరోవైపు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఈరోజు మధ్యాహ్నాం 2:00 గంటల నుంచి మూసివేస్తున్నట్లు అర్చకులు చెప్పారు. ఆదివారం ఉదయం సంప్రోక్షణ, పుణ్యవచనం, గ్రహణ హోమం తర్వాత.. ఉదయం 9 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి ఉంటుందని వివరించారు. చంద్రగ్రహణం కారణంగా కోజాగిరి పౌర్ణమి ఉత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు అర్చకులు వివరించారు.
Lunar Eclipse 2023 Today : భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని ఈరోజు మధ్యాహ్నాం నుంచి మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 7:00 గంటల నుంచి భక్తులకు దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయని.. కానీ అంతరాలయ అభిషేకంలో భక్తులకు అనుమతి ఉండదని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని.. శనివారం సాయంత్రం 4:15 గంటలకు మూసివేస్తున్నట్లు అర్చకులు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 3:40 గంటలకు ఆలయాన్ని తెరచి.. పుణ్యవచనం ,సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజల తర్వాత భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయని వారు వివరించారు.