Lulu Investments in Hyderabad : రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్ అండ్ రిటైల్ రంగంలో తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంతర్జాతీయ సంస్థ లులూ ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటనలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు నేడు ఐటీసీ కాకతీయ హోటల్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాబోయే రోజుల్లో తాము చేపట్టనున్న కార్యకలాపాలను వెల్లడించారు. కార్యక్రమంలో లులూ ఛైర్మన్ యూసఫ్ అలీ పాల్గొన్నారు. భవిష్యత్తులో లులూ సంస్థ నగరంలో చేపట్టనున్న కార్యకలాపాలను ఆయన వివరించారు.
KTR on LuLu Group investment in Telangana : ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు యూసఫ్ అలీ తెలిపారు. ఇప్పటికేరూ.300 కోట్ల పెట్టుబడితో లులూ షాపింగ్ మాల్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నామని.. ఆ పనులు దాదాపు పూర్తైనట్లు వివరించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి హైదరాబాద్ నగరంలో లులూ మాల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు... మాంసం, మత్స్య ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
''తెలంగాణలో రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్ అండ్ రిటైల్ రంగంలో మా కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో లులూ షాపింగ్ మాల్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నాం. ఆ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి హైదరాబాద్ నగరంలో లులూ మాల్‌ను ప్రారంభిస్తాం.''- లులూ ఛైర్మన్ యూసఫ్ అలీ
పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ.. : ప్రపంచ స్థాయి సంస్థ లులూ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా 5 రకాల విప్లవాలతో.. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.9 ఏళ్ల అభివృద్ధిలో అగ్రపథంలోకొనసాగుతున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులతో తెలంగాణ పర్యాటకంగా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి స్పష్టం చేశారు.