ఇంటిల్లిపాదీ ఖాళీగా ఉన్నప్పుడూ, బామ్మా తాతలకు బోరు కొట్టినప్పుడూ, షూటింగ్ విరామంలో నటీనటులకు సమయం చిక్కినప్పుడూ... ఇలా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ చేసే పని లూడో కింగ్ ఆడటం. లాక్‌డౌన్ వేళ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరి ఫోన్‌లో లూడో తిష్ట వేసి కాలక్షేపం అయ్యేలా చేసింది. అంతేకాదు అప్పటివరకూ దీని నిర్వహణకు మాకు రెండు సర్వర్లు సరిపోయేవి. లాక్‌డౌన్ వేళ ఒక్కసారిగా డౌన్‌లోడ్లు ఊపందుకుని అవి క్రాష్ అవ్వడం మొదలైంది. దాంతో ఒక్కోటిగా ఆ సంఖ్యను పెంచుకుంటూ రెండు వందల సర్వర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో మా టీం సభ్యులం ఇళ్లకు కూడా వెళ్లకుండానే ఆఫీసులోనే ఉండి సర్వర్లు క్రాష్ అవ్వకుండా చూసుకున్నాం. అదంతా చూశాక లూడో కింగ్ తప్పకుండా మనదేశంలో నంబర్‌వన్ గేమ్ అవుతుందని అర్థమైంది. అనుకున్నట్టుగానే 46కోట్లకుపైనే డౌన్‌లోడ్లతో నన్ను విజయాల బాట పట్టించింది. నిజానికి నేను ఆ స్థాయికి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నా. మరెన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇప్పుడు ప్రతిరోజూ పడుకునే ముందు అవన్నీ గుర్తుచేసుకుంటూ ఉంటా.
మాది పట్నాలోని పేద కుటుంబం. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. నాకు రెండేళ్లు వచ్చే వరకూ ఎలాంటి సమస్యలూ లేవు. మా ఇల్లు ఎప్పుడూ బంధువులతో కళకళలాడుతుండేది. కానీ ప్రమాదవశాత్తూ నాన్న చనిపోయాక ఆ కళా, బంధువుల రాకా తగ్గిపోయాయి. ఒక్కసారిగా ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. అమ్మ పెద్దగా చదువుకోలేదు. బయటకు వెళ్లడం కూడా తెలీదు. అన్నయ్యా, నేనూ చిన్న పిల్లలం. ఒంటరిదైన అమ్మను మా బంధువులు కూడా చేరదీయలేదు. సొంత ఇల్లు కూడా లేని మేము అద్దె తగ్గించుకోవాలని రెండు గదుల ఇంటికి మారాం. నాన్న పెన్షన్ డబ్బులతోనే అమ్మ మమ్మల్ని పెంచడం మొదలుపెట్టింది. నిజానికి చిన్నతనంలో నేను బాధ్యత లేకుండా పెరిగా. ఇంటి సమస్యలేవీ పట్టేవి కాదు. అన్నయ్యా, అమ్మా అన్నీ చూసుకుంటారులే అనుకునేవాడిని. ఎప్పుడూ స్నేహితులతోనే కాలక్షేపం. చదువు కూడా పెద్దగా ఎక్కేది కాదు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా ఫ్రెండ్స్‌తో కలిసి నేరుగా గేమింగ్ పార్లర్లకు వెళ్లేవాడిని. పాకెట్‌మనీ అంతా అక్కడే ఖర్చయ్యేది. చేతిలో ఎక్కువ డబ్బులుంటే స్కూలు కూడా మానేసి ఆ పార్లర్‌లోనే గంటలు గంటలు గడిపేవాడిని. వాటిని ఖర్చు పెట్టేముందు ఇంటి గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించేవాడిని కాదు. కానీ మా అమ్మ ఇంట్లో ఇరవై నాలుగ్గంటలూ నా గురించే ఆలోచించి బాధపడేది. నేను ఏమైపోతానో, నా భవిష్యత్తు ఎటువెళుతుందోననీ కుంగిపోయేది. ఆ ఆందోళనతోనే ఇంట్లో ఉన్నంతసేపూ తిడుతూనే ఉండేది. అయినా అవేమీ నేను పట్టించుకునేవాడిని కాదు. అయితే ఇంటర్‌కి వచ్చాక కొన్ని కారణాల వల్ల బిహార్ ప్రభుత్వం గేమింగ్ పార్లర్లను మూసివేయించింది. ఆ విషయం తెలిసి ఎంత బాధపడ్డానో. ఒకరకంగా డిప్రెషన్‌లోకి వెళ్లానని చెప్పాలి. నిజానికి ఆ నిర్ణయం నా జీవితాన్ని ఓ మలుపు తిప్పింది. ఎందుకంటే ఆడుకోవడానికి వీలులేక ఎప్పటికైనా అలాంటి గేముల్ని రూపొందించాలనే ఆలోచన కలిగింది. అదే సమయంలో ఇంటి గురించీ ఆలోచించే సమయం దొరికింది. స్నేహితులూ, వ్యాపకాలూ తగ్గిపోయాయి. అమ్మా, అన్నయ్యలకి దగ్గరయ్యా. చాలీచాలని డబ్బుతో అమ్మ పొదుపుగా ఇంటిని నెట్టుకురావడం, తనకోసం ఏమీ ఖర్చు పెట్టుకోకుండా మా కోసం త్యాగాలు చేయడం స్వయంగా చూశా. డబ్బులు వృథా చేసి అమ్మని కష్టపెట్టినందుకు ఎంతో బాధనిపించింది. అప్పట్నుంచీ తనని ఇబ్బంది పెట్టకూడదనీ, బాగా డబ్బు సంపాదించి అమ్మ కోరుకున్నవన్నీ ఇవ్వాలనీ గట్టిగా నిర్ణయించుకున్నా.
అమ్మ నగలమ్మింది...
ఆ తరవాత అతికష్టం మీద చదువుపైన శ్రద్ధ పెట్టా. ఇంటర్ సెకండ్ ఇయర్ మంచి మార్కులతో పాసయ్యా. ఆ తరవాత ఏం చదవాలీ అని ఆలోచిస్తున్నప్పుడు ఐటీ ఉద్యోగులకు బాగా జీతం వస్తుందని తెలిసింది. పైగా ఆ చదువుతో గేముల్ని కూడా రూపొందించొచ్చని స్నేహితులు చెప్పారు. దాంతో ఎలాగైనా బీటెక్ చదవాలనిపించింది. కానీ ఆ రోజుల్లో బీటెక్ ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. పైగా అమ్మకి చదివించే స్థోమత లేదు. అన్నయ్య కూడా చదువుకుంటున్నాడు. ఎలాగోలా చదువుకి డబ్బులు కూడబెట్టుకోవడం మంచిదని వెంటనే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయలేదు. ఇంట్లో కూర్చుని చదువుకుంటూనే నాకెంతో ఇష్టమైన గ్రీటింగు కార్డుల్ని తయారు చేసి వాటిని స్థానిక స్టేషనరీ షాపుల్లో అమ్మడం మొదలుపెట్టా. అలానే రెండుమూడు షాపుల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసి డబ్బులు సంపాదించేవాడిని. నేను అలా బాధ్యతగా ఉండటం అమ్మకి సంతోషంగా అనిపించినా... మరోవైపు నేను పడుతున్న కష్టం చూసి తట్టుకోలేకపోయింది. అందుకే నేను దాచుకున్న డబ్బుకు తోడు కొంత అప్పు చేసి ఇంజినీరింగు ప్రవేశ పరీక్ష రాయమని ప్రోత్సహించింది. అలా కష్టపడిన నాకు 1999లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులందర్‌షాలో ఉన్న ‘మరాఠ్‌వాడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో సీటు వచ్చింది. అమ్మ కష్టాన్ని వృథా చేయకూడదు అని నిర్ణయించుకుని హాస్టల్‌కి వెళ్లా. కొన్నాళ్లకి చదువుకితోడు కంప్యూటర్ కూడా ఉంటే ఇంకా బాగా చదవొచ్చని అర్థమైంది. కానీ అంత డబ్బు లేదు. ఒకసారి ఇంటికి వెళ్లినప్పుడు స్నేహితులతో అదే విషయం మాట్లాడుతుంటే అమ్మ విన్నది. పదిరోజుల తరవాత కాలేజీకి తిరిగి వెళుతుంటే తన దగ్గరున్న నగలు అమ్మి కంప్యూటర్ కొనుక్కోమని డబ్బులు చేతిలో పెట్టింది. అలా కంప్యూటర్ కొనుక్కున్న నేను దాన్ని నా గదిలో పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకునేవాడిని. అమ్మ కష్టాలన్నీ కంప్యూటర్ రూపంలో కనిపించేవి. నా స్నేహితులంతా కంప్యూటర్‌ని పాటలూ, సినిమాలూ చూడ్డానికి వాడినా నేను మాత్రం చదువుకోవడానికే ఉపయోగించే వాడిని. అర్ధరాత్రి వరకూ మేల్కొని రకరకాల కంప్యూటర్ మ్యాగజైన్లు చదువుతూ సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటుండేవాడిని. దాంతో మా క్యాంపస్‌లో టెక్నికల్‌గా ఎవరికి ఏ సందేహం వచ్చినా నా దగ్గరకే వచ్చేవాళ్లు. బీటెక్ చివరి ఏడాదిలో ఉండగా తలా ఒక ప్రాజెక్టు చేయమన్నారు. అప్పుడు నేను నాకెంతో ఇష్టమైన గేమును ఒకదాన్ని రూపొందించి ‘ఎగ్గీబాయ్’ అనే పేరు పెట్టా. దానికి కాలేజీలో మంచి పేరు వచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థులంతా అడిగి మరీ తమ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేయించుకుని ఆడుతుండేవారు. అంతేకాదు, ఓ ప్రముఖ కంప్యూటర్ మ్యాగజైన్ గేముతోపాటు నా గురించీ తమ పుస్తకంలో ప్రచురించింది. ఆ గుర్తింపు నాలో
తెలియని ఉత్సాహాన్ని నింపింది.