రాష్ట్రంలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ-ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియకు అడుగడుగున ఆడ్డంకులు ఏర్పడుతున్నాయి. గడువు ముంచుకొస్తున్నా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించాల్సిన అధికారులకు.. లాగిన్ ఐడీలు ఇవ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో కొత్తగా చేరిన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే చేస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారికి అదనపు చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. వివిధ శాఖల నుంచి నిరభ్యంతర పత్రాలు అందించేందుకు కూడా ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. కానీ పురపాలక శాఖ నిర్లక్ష్యం వైఖరితో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
లాగిన్ ఐడీలు ఇప్పటికీ ఇవ్వలేదు..
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను అధికారులు ఆన్‌లైన్‌లో పరిశీలించాలంటే లాగిన్ ఐడీ తప్పనిసరి. అది లేకుండా అడుగు ముందుకు పడదు. పట్టణ ప్రణాళిక అధికారులు, పురపాలక కమిషనర్లు, సహాయ సిటీ ప్లానర్లకు లాగిన్ ఐడీలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. అధికారులు దరఖాస్తులను పరిశీలించకపోతే తదుపరి ప్రక్రియకు అవకాశం ఉండదు. ఈ ప్రక్రియ మొదలై దాదాపు రెండు నెలలు కావొస్తున్నా ఇంత వరకు లాగిన్ ఐడీలు ఇవ్వకపోవడం వల్ల ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకే పరిమితమైంది.