Low Temperatures in Telangana: రాష్ట్రంలో ఆకాశం నిర్మలంగా ఉండటంతో రాత్రిపూట త్వరగా చల్లబడి శీతలగాలులు వీస్తున్నాయి. దట్టమైన మేఘాలుంటే భూ వాతావరణం ఎక్కువగా చల్లబడదు. తెల్లవారుజాము నుంచి ఉదయం 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తుండటంతో ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో రాత్రిపూట 5 నుంచి 10 డిగ్రీల వరకే ఉష్ణోగ్రత ఉంటోంది. రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా ఆదివారం తెల్లవారుజామున ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 5.7 డిగ్రీలు, హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్, రాజేంద్రనగర్‌లలో 9.7 డిగ్రీలు నమోదైంది. నగర శివారులో 10 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవడం ఈ నెలలో ఇదే తొలిసారి. గత పదేళ్ల కాలంలో జనవరి నెలలో హైదరాబాద్ నగరంలో అత్యల్ప ఉష్ణోగ్రత 2012 జనవరి 15న 8.4 డిగ్రీలుగా వాతావరణ శాఖ రికార్డుల్లో ఉంది.
సాధారణం కన్నా 5 డిగ్రీలు తక్కువైతే శీతలగాలులు..
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కన్నా ఐదారు డిగ్రీలు తక్కువగా ఉంటోంది. సాధారణం కన్నా 5 డిగ్రీలు తక్కువగా, 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదైతే ఆ ప్రాంతంలో శీతలగాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో రాత్రి సమయంలో ఇలాంటి పరిస్థితులే ఉండటంతో శీతలగాలులు వీస్తున్నట్లు హెచ్చరికలు జారీచేసింది. మంగళవారం రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని అంచనా.