తెలంగాణ

telangana

ETV Bharat / state

గిట్టుబాటు ధరలేక... నష్టపోతున్న పసుపు రైతులు - తెలంగాణ పసుపు రైతుల ఇబ్బందులు

తెలంగాణలో పసుపు పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని రైతులు చెబుతున్నారు. ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలో క్వింటా పసుపు ధర గరిష్ఠంగా రూ.6850 నుంచి రూ.7 వేలు పలుకుతోంది. రాష్ట్రంలో మాత్రం క్వింటాకు రూ.3001 నుంచి 5229 వరకు మాత్రమే వ్యాపారులు ఇస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.

low prices of turmeric farmers in telangana
రాష్ట్రంలో నష్టపోతున్న పసుపు రైతు

By

Published : Jun 15, 2020, 8:37 AM IST

Updated : Jun 15, 2020, 9:07 AM IST

జాతీయ, రాష్ట్ర స్థాయిలో పసుపు పంట ఎగుమతులు పెరిగినా.. తెలంగాణ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. కేవలం కొందరు వ్యాపారులు మాత్రం లాభాలు పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గత మూణ్నెల్లుగా లాక్‌డౌన్‌ పరిస్థితులున్నా ఆ పంటకు అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్​ పెరుగుతోందని ఎగుమతి వ్యాపార వర్గాలు తెలిపాయి. వరుసగా రెండో ఏడాది జనవరి నుంచి మే నెల వరకు పంట ఎగుమతులు 8 శాతం వృద్ధి చెంది 59,580 టన్నులకు చేరాయి. 2018తో పోలిస్తే 9 వేల టన్నులు అదనంగా ఎగుమతులు పెరగడం రికార్డు అని జాతీయ సుగంధ ద్రవ్య మండలి తెలిపింది. పసుపును ఆహారంలో తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుందని కరోనా నియంత్రణకు దోహదపడుతుందని కొందరు వైద్యులు పసుపును సిఫార్సు చేస్తున్నారు. ఇది కూడా ఎగుమతులు పెరగడానికి కారణమని నిపుణుల అంచనా వేశారు.

నష్టపోతున్న పసుపు రైతు

రాష్ట్రంలో పసుపు పంటకు ధర లేక రైతులు నష్టపోతున్నారు. మే 27 నుంచి జూన్‌ 12 వరకూ నిజామాబాద్‌ మార్కెట్‌లో లక్ష క్వింటాళ్ల వరకూ పసుపు పంటను వ్యాపారులు కొన్నారు. రాష్ట్రంలో పెద్దగా ఎగుమతిదారులు లేకపోవడం సమస్యగా మారింది. ఇద్దరు వ్యాపారులు మాత్రమే ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడి పంటను కొన్న టోకు వ్యాపారులు ముంబయి ఎగుమతి సంస్థలకు అమ్ముకుంటున్నారు. వారు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. లాభాలను వ్యాపారులే పంచుకుంటున్నారు తప్ప రైతులకు ధర ఇవ్వడం లేదు. ఎగుమతి సంస్థలే నేరుగా వచ్చి కొంటే ధర పెరుగుతుందని మండలి ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

క్వింటాకు పెట్టుబడి రూ.7 వేలు

దేశంలోనే అత్యధికంగా పసుపు పండించే రాష్ట్రంగా తెలంగాణ పేరొందినా.. ధర మాత్రం తక్కువ ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇక్కడ క్వింటా పసుపు పండించడానికి రైతులు రూ.7 వేలు పెట్టుబడి పెడుతున్నారని, అంతకుమించి ధర ఇస్తేనే వారికి గిట్టుబాటవుతుందని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు వెంకట్రాంరెడ్డి చెప్పారు. లక్షన్నర ఎకరాల్లో పంట సాగవ్వగా 40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈనెల 12న మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మార్కెట్‌కు 10,241 క్వింటాళ్ల పసుపు వస్తే.. క్వింటాకు రూ.3001 నుంచి 5229 దాకా మాత్రమే వ్యాపారులు ఇచ్చారు. ఆ పంటలో అధిక శాతం రూ.4711లోపే కొన్నట్లు మార్కెటింగ్‌ శాఖ తెలిపింది. కానీ ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలలో క్వింటా పసుపు ధర గరిష్ఠంగా రూ.6850 నుంచి రూ.7 వేలు పలుకుతోంది.

ఇదీ చూడండి :'నేనెవరో తెలుసా.. మీ వ్యవసాయశాఖ మంత్రిని...'

Last Updated : Jun 15, 2020, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details