Rajiv Swagruha Flats: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ఇటీవల హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ) వేలం ద్వారా విక్రయించిన విషయం తెలిసిందే. రాజీవ్ స్వగృహ కార్పోరేషన్‌కు సంబంధించి బండ్లగూడ నాగోలు, పోచారం ప్రాంతాల్లో మిగిలిపోయిన త్రీబుల్ బెడ్ రూమ్ 3 బీహెచ్‌కే, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ సీనియర్ సిటిజన్ ఫ్లాట్ల కేటాయింపుల కోసం మార్చి 3వ తేదీన లాటరీ నిర్వహిస్తున్నట్లు హెచ్ఎమ్డీఏ తెలిపింది.
ఫిబ్రవరి 15వ తేదీ వరకు టోకెన్ అడ్వాన్స్‌గా 3 బీహెచ్‌కే కోసం రూ.3 లక్షలు, 2 బీహెచ్‌కే కోసం రూ.2 లక్షలు, 1 బీహెచ్‌కే కోసం రూ.1 లక్ష చొప్పున డిమాండ్ డ్రాఫ్టులు కట్టిన వారు లాటరీకి అర్హులుగా ప్రకటించారు. మార్చి 3వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి జరిగే లాటరీని పారదర్శకంగా దరఖాస్తుదారులు ఆన్లైన్లో ప్రత్యక్షంగా యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తిలకించవచ్చన్నారు.
మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పరిధిలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎమ్డీఏ) లేఔట్లో సోమవారం ప్రీ బిడ్ సమావేశం జరిగింది. మేడిపల్లి లేఔట్లో హెచ్ఎమ్డీఏ 300 చదరపు గజాలు గల 50 ఫ్లాట్లను రూపొందించింది.