తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజధానిపై కరోనా పడగ.. భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య - hyderabad latest news

హైద‌రాబాద్​లో క‌రోనా జ‌డ‌లు విప్పుతోంది. ప‌గ‌బ‌ట్టిన‌ట్లుగా గ్రేట‌ర్ హైద‌రాబాద్​లోనే భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. వైరస్​ క‌ట్టడిలో ముందు వ‌రుస‌లో ఉన్న వైద్యలు, పోలీసులు, బ‌ల్దియా సిబ్బంది అధికంగా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. న‌గ‌రంలో కేసులు పెరిగిపోతుండం వల్ల స‌చివాల‌య సిబ్బంది రొటేషన్ విధానంలో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

lot of corona cases in greater hyderabad
రాజధానిపై కరోనా పడగ.. భారీగా పెరుగుతున్న కేసుల సంఖ్య

By

Published : Jun 21, 2020, 2:29 AM IST

Updated : Jun 21, 2020, 5:29 AM IST

భాగ్యనగరిలో క‌రోనా తీవ్రత కొనసాగుతోంది. శనివారం న‌గ‌రంలో భారీ సంఖ్యలో కేసులు న‌మోద‌య్యాయి. పోలీస్ శాఖలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మిగతా ప్రభుత్వ శాఖలతో పోలిస్తే.. పోలీస్ శాఖలో ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. లాక్​డౌన్ స‌మ‌యం నుంచి రోడ్లపై విధులు నిర్వహించ‌డం.. ఎక్కువ మందితో నేరుగా భేటీ అవటం తప్పనిసరి కావటంతో పోలీసు శాఖ‌లో వైరస్​ బారిన అధికంగా ప‌డుతున్నారు. ఒక్క జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే ఇప్పటి వ‌ర‌కు 150 మందికి పైగా పోలీసులకు వైరస్ సోకింది. ఇందులో ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్లంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నిన్న బంజారాహిల్స్ ఠాణాలోని న‌లుగురు సిబ్బందికి క‌రోనా సోకింది. వీరితో కలిపి బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో క‌రోనా బాధితుల సంఖ్య 26 కు చేరింది.

ఎమ్మెల్యే గన్​మెన్​కు కరోనా

భాజ‌పా గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజసింగ్ గన్​మెన్ బలరాం యాదవ్​కు కరోనా నిర్ధర‌ణయింది. గన్​మెన్​కు పాజిటివ్ రావడం వల్ల రాజాసింగ్ టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టు రావాల్సి ఉంది. సికింద్రాబాద్​లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కానాజిగూడసాయి ఎంక్లేవ్​లో ఒకే కుటుంబంలో ఐదుగురికి వైరస్ సోకిన‌ట్లు అధికారులు ప్రక‌టించారు. కుత్బుల్లాపూర్ సురారంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 58 మంది నమూనాలను సేకరించి పరీక్షించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి నిర్మల తెలిపారు.

అంబర్​పేట నియోజకవర్గంలో 11 కేసులు

అంబర్​పేట నియోజకవర్గ పరిధిలో శనివారం 11 కేసులు నమోదయ్యాయి. అంబర్​పేట్​లో 8 కేసులు నమోదు కాగా, నల్లకుంటలో 2, కాచిగూడలో ఒక కేసు నమోదయింది. అధికంగా న్యూ ప్రేమ్​నగర్​లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములకు పాజిటివ్ వచ్చింది. పటేల్​నగర్​లోని ఇద్దరు అక్కాచెల్లెలుకు వైరస్​ సోకింది.

రొటేషన్ విధానంలో విధులు

రోజురోజుకూ కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. సబార్డినేట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు నాలుగో తరగతి ఉద్యోగులు సగం మంది రొటేషన్ విధానంలో వారం రోజుల పాటు విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. క్లరికల్ స్టాఫ్, సర్క్యులేటింగ్ అధికారుల్లో సగం మంది రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని తెలిపింది. విడిగా చాంబర్లు కేటాయించిన అధికారులందరూ ప్రతిరోజు విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు.

సందర్శకులకు ప్రవేశం లేదు

రొటేషన్ విధానంలో విధులు నిర్వర్తించే వారంతా హెడ్ క్వార్టర్స్​లోనే ఉండాలని... అత్యవసర పనులు ఉంటే స్వల్పవ్యవధిలోనే విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సీఎస్ తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారి ముందస్తు అనుమతి లేకుండా సందర్శకులకు ప్రవేశం లేదని... లిఫ్టుల్లో ఆపరేటర్​తో పాటు ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. సోమవారం నుంచి జూలై నాలుగో తేదీ వరకు మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని సీఎస్ సోమేష్ కుమార్ పేర్కొన్నారు.

న‌గ‌ర శివారు జిల్లాల్లోనూ

న‌గ‌ర శివారు జిల్లాల్లో కూడా వైర‌స్ వేగంగా వ్యాపిస్తోంది. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్​నగర్​లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ప్రక‌టించారు. మీర్​పేట్ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్​కు వైరస్​ సోకింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఒక్కరికి కొవిడ్​ పాజిటివ్ నిర్దరణయింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బృందావన్​కాలనీలో ఒకరికి కరోనా వచ్చింది. వికారాబాద్ జిల్లాలో ఈ రోజు 2 కేసులు న‌మోద‌ు కాగా... తాండూర్ మండలం అంతారంలో ఒక‌టి, పూడూర్ మండలం కంకాల్​ ఒక కేసు న‌మోద‌యింది.

ఇవీ చదవండి:కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

Last Updated : Jun 21, 2020, 5:29 AM IST

ABOUT THE AUTHOR

...view details