భండాసురుడి నుంచి కాపాడమని దేవతలు శరణుకోరగా శివుడు నేత్రాగ్నితో యజ్ఞకుండాన్ని రగిలించాడు. అందులోంచి పుట్టిన లలితాపరమేశ్వరి శక్తి సేనల్ని ఆవిర్భవింపచేసి... భండాసురుడి సైన్యాన్ని నిర్వీర్యం చేసింది. అప్పుడా రాక్షసుని సోదరుడు విశుక్రుడు సోమరితనం, నిద్ర, అయోమయం లాంటి ఎనిమిది అవగుణాలతో విఘ్నయంత్రాన్ని సృష్టించి శక్తిసేనలను హరించాడు. సేనాధిపతి వారాహి కంగారుగా అమ్మవారిని చూసింది. ఆమె భర్త కామేశ్వరుని ప్రేమగా చూసింది. శివుడు కూడా ప్రేమగా చూశాడు. ఇద్దరి చూపుల కలయికతో మహాగణపతి ఉద్భవించాడు. మనిషిని నిర్వీర్యంచేసే ఆ విఘ్నయంత్రాన్ని ఛిన్నాభిన్నంచేసి శక్తిసేనలో వీరత్వాన్ని నింపి అమ్మకు విజయాన్ని చేకూర్చాడు. తాము ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు మాత్రమే శివుని బాణంతో మరణించేలా వరం పొందిన త్రిపురాసురులను తన తొండంతో సరళరేఖపై పట్టివుంచి తండ్రికి కూడా విజయం కలిగించాడు.
ప్రకృతి, పురుషుల వ్యక్తావ్యక్త సంయోగంతో ఉద్భవించిన వల్లభ గణపతి చేతుల్లో శంఖచక్రాలు, శూలపాశాలు, చెరుకుగడ, నల్లకలువలు, వరికంకులు, గద, దానిమ్మపండు, దంతం ఉంటాయి. ఇవి లక్ష్మీనారాయణ, శివపార్వతులు, రతీమన్మథులు, భూదేవి వరాహస్వామి, పుష్టి పుష్టిపతుల తత్వాలకు సంకేతమై సకల దేవతా స్వరూపుడుగా కనిపిస్తాడు.
వాగీశాద్యా సుమనసః సర్వార్థానముపక్రమే
యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననమ్
ఏ పనికి ఉపక్రమించినా గణపతిని స్మరించనిదే సాఫల్యం చేకూరదు.
బ్రహ్మదేవుని ఆటంకాలు తొలగించాడు
సృష్టి రచనలో ఆటంకాలు ఎదురవగా పరమాత్మను ధ్యానించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు పరమాత్మ ఓంకార రూపంలో దర్శనమిచ్చి వక్రతుండ మంత్రాన్ని ప్రసాదించాడు. వక్రతుండమంటే వంకర తొండం కలిగినవాడనే కాకుండా వక్రాలను తుండం చేసేవాడని కూడా అర్థం.
వ్యాసమహర్షికి లేఖకుడైన వైనం
మహాభారత రచనకు పూనుకున్న వ్యాసమహర్షి దానికెలా రూపమివ్వాలనే సందేహంతో బ్రహ్మదేవుని ప్రార్థించగా, వినాయకుడు మార్గం చూపగలడన్నాడు బ్రహ్మ. వ్యాసుని చిత్తశుద్ధికి ప్రసన్నుడైన గణపతి మహాభారత లేఖనానికి ఒప్పుకుంటూనే ఓ నిబంధన విధించాడు. రచన మొదలయ్యాక తన లేఖిని ఆగదని, నిరంతరాయంగా చెప్తేనే రాస్తానన్నాడు. వ్యాసుడు కూడా తన శ్లోకాలను అర్థంచేసుకుని మాత్రమే రాయాలంటూ ప్రతినిబంధన పెట్టాడు. ఇద్దరూ ఒప్పుకున్నారు. వినాయకుని లేఖన వేగాన్ని అందుకోవడం ఒక్కోసారి వ్యాసునికి కష్టమయ్యేది. అలాంటప్పుడు అసంగతం, విరోధం అనిపించే శ్లోకం చెప్పేవాడు. వినాయకుడు ఆగగానే వ్యాసుడు తర్వాతి శ్లోకాల్ని అల్లేవాడు. ఒకసారి ఘంటం విరిగిపోతే, తన దంతాన్నే విరిచి ఘంటంగా ఉపయోగించాడు. భారతమే కాదు వ్యాసుని అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు మొదలైన వాటన్నింటికీ లేఖకుడు వినాయకుడే అంటారు.
నరాకారో మాయా గజాకారో పురుషః
కంఠాధో జగన్మయం కంఠోర్ధ్వంతు చిన్మయం
అంటుంది ముద్గల పురాణం. శరీరాన్ని శాసించేది శిరస్సు. ప్రపంచాన్ని శాసించేది పరమాత్మ. అందుకే విశ్వాన్ని మనిషి శరీరంతో, దాన్ని శాసించే పరమాత్మను ఏనుగుతలతో చూపించాడు.
ఏక శబ్ద ప్రధానార్థో దంతశ్చ బలవాచకః
ప్రధానం సర్వస్మాత్ ఏకదంతం ఉపాస్మహే