లాక్‌డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోయి ఒకరు.. కొడుకును చూడలేననే బెంగతో మరొకరు.. మట్టికి దూరమయ్యాననే బాధతో ఇంకొకరు.. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదాంతం. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేసింది.
అమ్మ రావొద్దంది.. ప్రాణమే వద్దనుకుంది..!
చిన్న వయసులోనే ఉన్న ఊరిని, కన్నతల్లిని వదిలి పనికోసం నగరానికొచ్చింది కృష్ణా జిల్లాకు చెందిన శ్రీవల్లి. ఆర్థికంగా కుటుంబానికి ఆసరానిచ్చేందుకు వందల మైళ్లు దాటి హైదరాబాద్ చేరుకుని ఇక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. ప్రతినెలా ఠంచనుగా ఇంటికి డబ్బులు పంపేది. గతవారమే తన అక్కకి కొడుకు పుట్టాడు. లాక్‌డౌన్ ఉన్నా ఎలాగైనా వెళ్లాలనే ఆలోచనతో తోచిన అన్ని ప్రయత్నాలు చేసింది. ఐదు రోజులుగా రోజూ వస్తానంటూ అమ్మకి ఫోన్ చేసింది. కానీ, వచ్చినా ఇక్కడ క్వారెంటెయిన్‌లో పెడుతున్నారు రావొద్దని తల్లి నచ్చజెప్పింది. క్షణికావేశంలో భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
‘తల్లి’డిల్లి.. తనువు చాలించి..
నగరంలోని చిక్కడపల్లి ప్రాంతంలో ఉంటున్న లక్ష్మి, బాలరాజు దంపతుల సొంతూరు సిరిసిల్ల. ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి ఇక్కడే స్థిరపడ్డారు. యూకేలో ఉంటున్న కొడుకు మార్చిలో రావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకుని అక్కడే ఆగిపోయాడు. అప్పటి నుంచి ఆందోళనలో ఉన్న తల్లి యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది.