Lokesh On Pegasus: పెగాసస్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సవాల్ విసిరారు. బాబాయ్ వివేకా హత్య, మద్యం మరణాలపైనా విచారణ కమిటీ వేయగలరా ? అని ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన ప్రశ్నించారు. పెగాసస్‌పై మమత అసెంబ్లీలో మాట్లాడారనే దానిపై స్పష్టత లేదన్నారు. పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌ను తాము కొనలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్న లోకేశ్.. వైకాపా ఎమ్మెల్యే అంబటికి ఉందేమోనని అందుకే ఆయన రాసలీలలు బయట పడ్డాయని దుయ్యబట్టారు.
వ్యక్తులకు, ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారన్నారు. అయినా నిబంధనలకు విరుద్దంగా సభలో పెగాసెస్ సాఫ్ట్‌వేర్‌పై స్వల్ప కాలిక చర్చకు అనుమతించరని మండిపడ్డారు. తాము మద్యం మరణాలపై ప్రతి రోజూ డిమాండ్ చేస్తోంటే చర్చకు అనుమతించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారంతో సభలో పెగాసస్‌పై చర్చ పెట్టారని ఆక్షేపించారు. కల్తీ సారా, కల్తీ మద్యంతో పేదలను చంపేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.