Lokesh Padayatra: పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కాణిపాకం వరసిద్ధి వినాయకుణ్ని దర్శించుకున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు మహిళలు హరతులు పట్టి, టీడీపీ శ్రేణులు అడుగడుగున పూలమాలలు వేస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం తవణంపల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో సమావేశమయ్యారు.
గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కరిస్తాం :కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. టీడీపీ అధికారంలోకి తేవడానికి మీ వంతు సహకారం అందించాలని లోకేశ్ తెలిపారు. తవణంపల్లి వద్ద ప్రజలతో మాట్లాడిన లోకేశ్ సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని.. ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. బాబాయిని చంపింది అబ్బాయేనని ఆరోపించారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలి అని తెలిపారు.
స్థానిక హైస్కూల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని.. కానీ నాడు-నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ది లేదన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా బెదరం, భయపడమన్నారు. కొడాలి నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో..:రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో.. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎవరు తరిమారో చర్చించడానికి సిద్దమా అని లోకేశ్ సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అడుగడుగునా వైసీపీ నేతలను చెప్పులతో కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.