Lok Sabha Approves Telangana Tribal University Bill :ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం, తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ బిల్లుకు (Sammakka Sarakka Tribal University Bill) గురువారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం బిల్లుపై రెండు రోజుల చర్చల అనంతరం సభ మూజువాణి ఓటుతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
గిరిజనుల అభ్యున్నతికి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) పేర్కొన్నారు ఇందులో భాగంగానే సమ్మక్క సారక్క వర్సిటీ నెలకొల్పుతున్నామని చెప్పారు. సమ్మక్క సారక్క పేరిట తెలంగాణలోని మేడారంలో జరిగే అతిపెద్ద గిరిజన ఉత్సవానికి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందినవారే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల గిరిజనులు హాజరవుతుంటారని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అందుకే ఆ ఉత్సవం జరిగే ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Sammakka Sarakka Tribal University : HCU స్థాయిలో గిరిజన యూనివర్సిటీ.. వచ్చే ఏడాది నుంచి తరగతులు!
Lok Sabha Approves Sammakka Sarakka Tribal University Bill : ఈ యూనివర్సిటీ ఏర్పాటులో జాప్యం గురించి చాలా మంది సభ్యులు ప్రశ్నించారని.. అయితే తెలంగాణ సర్కార్ స్థలం కేటాయించడంలో జాప్యం చేయడం వల్లే ఇది ఆలస్యమైందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటపడటంతో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్థలం కేటాయించిందని చెప్పారు. దాదాపు రూ.900 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.