తెలంగాణ

telangana

ETV Bharat / state

TS UNLOCK: తెలంగాణ అన్​లాక్.. ఇవన్నీ ఓపెన్ - లాక్​డౌన్ ఆంక్షలు రద్దు

lockdown-totally-suspended-in-telangana
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత

By

Published : Jun 19, 2021, 3:13 PM IST

Updated : Jun 19, 2021, 7:37 PM IST

15:12 June 19

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత

తెలంగాణలో లాక్​డౌన్​ను సంపూర్ణంగా ఎత్తివేస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్​లాక్​ ఉత్తర్వులు జారీ చేసి... తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కొవిడ్​ ఉద్ధృతి తగ్గడంతో లాక్​డౌన్​ ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినేట్ వెల్లడించింది.

పూర్తి నియంత్రణలో కరోనా

కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యారోగ్యశాఖ నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన మంత్రివర్గం వైద్యారోగ్యశాఖ నివేదిక ఆధారంగా లాక్​డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేసింది. ఈ మేరకు అధికారులకు మంత్రివర్గం ఆదేశాలు జారీ చేసింది. సూపర్​ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. 

ఎప్పటిలాగే అన్ని సర్వీసులు

లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో... ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడవనున్నాయి.  ఇక అంతర్రాష్ట్ర ప్రయాణాలు, బస్సు సర్వీసుల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉదయం వేళ ప్రయాణాలు కొనసాగుతుండటగా, తాజా నిర్ణయంతో రాత్రివేళ కూడా బస్సులు తిరగనున్నాయి. అదే విధంగా పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు తెరిచే విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రజల సహకారం అవసరం

ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతోనే లాక్​డౌన్ ఎత్తివేశామని రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం అందించాలని కోరింది. లాక్​డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని వెల్లడించింది. ప్రతిఒక్కరూ తప్పని సరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ వినియోగించడం వంటి.. తదితర  కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని సూచించింది. కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణకు, ప్రజలు  సంపూర్ణ సహకారం అందించాలని స్పష్టం చేసింది.  

లాక్​డౌన్​ ఎప్పుడు ప్రారంభమైందంటే..

కరోనా కేసులు విజృంభించడంతో తొలుత మే 14 నుంచి 20 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్‌డౌన్ సడలింపు ఇవ్వగా... ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అయితే జూన్‌లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని నిర్ణయించింది. అయితే తాజా కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.   

ఇదీ చూడండి:Errabelli : 'కొవిడ్ మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి'

Last Updated : Jun 19, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details