గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. రోజూ ఉదయం 10 గంటలు దాటితేనే తెరుచుకునే వాణిజ్య, వ్యాపార సముదాయాలు... అందుకు భిన్నంగా ఆ సమయానికే మూతపడ్డాయి. లాక్‌డౌన్‌లో భాగంగా ఉదయం 6 నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అన్ని కార్యకలాపాలకు అనుమతి ఉండగా.. పొద్దున్నే వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. నిత్యావసరాల దుకాణాలతో పాటు ఎలక్ట్రానిక్స్ తదితర షాపుల యజమానులు ఆరింటికే కొనుగోలుదారుల రాక కోసం ఎదురుచూశారు. ప్రభుత్వం అనుమతించిన గడువు పది గంటలు సమీపిస్తుందనగానే దుకాణాలు మూసేసి ఇళ్లకు వెళ్లారు. మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. కొన్నిచోట్ల లాక్‌డౌన్‌పై అవగాహన లేనివాళ్లు టిఫిన్ సెంటర్ల వద్ద 10 గంటలు దాటినా కనిపించగా.. తొలిరోజు కేసుల నమోదుకు బదులు ఇళ్లకు వెళ్లాలని పోలీసులు సూచించారు. లాక్‌డౌన్ ప్రభావం చిరు, వీధి వ్యాపారులపై తీవ్రంగా పడింది.
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ ప్రశాంతం.. రోడ్లన్ని నిర్మానుష్యం - telangana lockdown news update today
లాక్‌డౌన్ అమలు తొలి రోజే హైదరాబాదీలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపులు ఇవ్వగా.. నాలుగు గంటల సమయంలోనే పనులన్నీ చేసుకునేందుకు నగరవాసులు హైరానా పడ్డారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 280 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసిన పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు.
ఉదయం 10 తర్వాత హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరాలు, మినహాయింపులు ఉన్న వారిని చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేసి పంపించారు. ఎంజే మార్కెట్, బేగంబజార్, కోఠి తదితర ప్రాంతాల్లో రద్దీ కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, బీహెచ్ఈఎల్, ఆల్విన్ కాలనీ కూడళ్లల్లో చెక్‌పోస్టులు పెట్టి.. ఎవరూ బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. ఎల్బీనగర్ తదితర చోట్ల అడ్డామీద కూలీలు నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోయారు.
కట్టుదిట్టంగా అమలు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 280 తనిఖీ కేంద్రాలను పోలీసులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో 180 తనిఖీ కేంద్రాలను 5 జోన్లుగా విభజించి ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. రవీంధ్ర భారతి, చార్మినార్, ఎంజే మార్కెట్, మదీనా వద్ద తనిఖీ కేంద్రాలను సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. రంజాన్ నాడు మసీదులకు రావద్దని ఆదేశించారు. సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ సైబర్ టవర్స్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మల్కాజిగిరి, ఎల్బీ నగర్ జోన్‌లలో పర్యటించి లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.