లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఉదయం వేళ ఇంటికి ఒకరు చొప్పున బయటకు వచ్చి నిత్యావసరాలు కొని తెచ్చుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. సాధ్యమైనంత త్వరగా పనులు ముగించుకొని ఇళ్లకే పరిమితం కావాలని, బయట తిరగొద్దని స్పష్టంగా పేర్కొంది. అయినా కొందరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కారణాలు చెబుతూ వాహనాలపై బయటకు వస్తున్నారు.
సాయంత్రం వరకూ రహదారులపై తిరుగుతూనే కన్పిస్తున్నారు. నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నామని చెబుతున్నా... అనవసరంగా బయటకు వస్తున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నా రాకపోకలకు మాత్రం బ్రేకులు పడడంలేదు.
ఎందుకు రోడ్లపై తిరుగుతున్నారని పోలీసులు ప్రశ్నిస్తే... ఒకరు ఆవులకు గడ్డి కోసం వెళుతున్నా అని, మరొకరు పాప ఐస్‌క్రీం కోసం మారాం చేస్తుంటే తీసుకొద్దామని ఉస్మానియా ఆసుపత్రి వద్దకు వెళుతున్నాం అంటూ సిల్లీ కారణాలు చెబుతూ రోడ్లపైకి వస్తున్నారు.