రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 4 గంటల పాటు.. యధావిధిగా అన్ని కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులిచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ హైదరాబాద్ నగరంలోని పలు వ్యాపారులు, దుకాణ దారులు ఉదయం 6 గంటలకే దుకాణాలు తెరిచారు.
ఎలక్రానిక్ దుకాణంలో కొనుగోలుదారులు రొటీన్‌కు భిన్నంగా..
ఎప్పుడూ లేని విధంగా షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు, బహుళ వాణిజ్య సముదాయాలు సైతం ఆరింటికే షట్టర్లు తెరిచారు. ఈమేరకు వర్కర్లకు ముందస్తు సమాచారం చేరవేసి పనిలోకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రభుత్వం ఇచ్చిన అతితక్కువ గడువులోనే పనులు చక్కబెట్టుకునేందుకు మార్కెట్లపై ఎగబడ్డారు. సూపర్ మార్కెట్లు, బట్టలు, ఎలక్ట్రానిక్స్ వంటి వాణిజ్య సముదాయాలకు ఉదయాన్నే క్యూ కట్టడం కనిపించింది.
లాక్డౌన్ సడలింపు సమయంలో పండ్ల విక్రయాలు చిరు వ్యాపారులకు నష్టం..
అయితే లాక్డౌన్ ప్రభావం చిరు, వీధి వ్యాపారాలపై తీవ్రంగా పడింది. ఆరింటికే దుకాణాలు తెరిచి సరుకులు తెచ్చుకొని వాటిని పేర్చి ఓపెన్ ఫర్ సేల్ చేసేందుకు వారికి సగం సమయం వృథా అవుతోంది. మిగిలిన రెండు గంటల్లో అరకొర కొనుగోళ్లు జరుగుతున్నాయని చిరువర్తకులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారం గిట్టుబాటు కావట్లేదని వాపోతున్నారు. స్వీట్లు, గాజులు, బట్టల దుకాణాల వారు తాము ఎన్నడూ ఇంత ఉదయాన్నే షాపులు తెరిచింది లేదని, ఉన్న కొద్దిపాటి సమయంలో వ్యాపారం చేస్తే ఎంతో కొంత లాభం దక్కుతుందోమోనని ఆశతో తెరిచామని పేర్కొన్నారు. ఉదయం 10 కాగానే ఎక్కడిక్కడ వ్యాపార సముదాయాలను మూసివేశారు. దుకాణాల్లో పనిచేసే వర్కర్లు వడివడిగా ఇళ్లకు చేరుకోవటం కనిపించింది.
పోలీసుల నియంత్రణ
పదిగంటల తర్వాత రోడ్డుపై ట్రాఫిక్ కాస్త తగ్గుముఖం పట్టింది. లాక్డౌన్ సమయంలో అత్యవసర, ఎమర్జెన్సీ సర్వీసులకే అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేస్తూ కీలకమైన సర్కిళ్ల వద్ద చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని నియంత్రిస్తున్నారు. లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి:లాక్డౌన్ ఎఫెక్ట్: భద్రాద్రి ఆలయం మూసివేత