తెలంగాణ

telangana

ETV Bharat / state

Need Help: ఆర్జించిన చేత్తోనే.. అర్థిస్తూ!

ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనెమో. ఆయన ఒకప్పుడు మంచిగానే బతికాడు. సొంతూరిలో ఏడెకరాల భూమి. బంధువులు.. చుట్టాలు.. చేయి చాచే పరిస్థితి లేదు. ఇంతలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో తన ఊరు పోయింది. భూమి మునిగిపోయింది. ప్రభుత్వం ఇచ్చిన కొద్దోగొప్పొ సాయంతో మరోచోట ఇల్లు కట్టుకున్నారు. భార్యా, నలుగురు పిల్లలు. భూమి పోవడంతో చేపలు అమ్మేవాడు. కొన్నాళ్లు బాగానే గడిచింది. కాలం కలిసిరాక అందులోనూ నష్టాలే. వేరేదారి లేక పొట్ట చేత్తో పట్టుకొని 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చాడు. కూలీనాలీ చేసుకుంటూ నలుగురి పిల్లలను పోషించాడు. ఇద్దరు ఆడపిల్లలకు, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేశాడు. మళ్లీ విధి పగబట్టింది. చిన్న కుమారుడు చనిపోగా, పెద్దతను తన దారి తాను చూసుకున్నాడు. చివరికి భార్యతో జీవిస్తుండగా ఆమెనూ కుంగదీసింది విధి.

lockdown-problems-in-old-couple-and-they-need-help
Need Help: ఆర్జించిన చేత్తోనే.. అర్థిస్తూ!

By

Published : May 27, 2021, 1:29 PM IST

మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని గ్రామానికి చెందిన బాలస్వామి, ఈశ్వరమ్మ దంపతుల సొంతూరు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో పోవడంతో హైదరాబాద్‌ చేరుకున్నారు . కానీ ఇక్కడ కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. ప్రమాదవశాత్తు భార్య తలకు దెబ్బతగలడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. కాళ్లు చేతులు చచ్చు పడిపోయాయి. మాట పడిపోయింది. కష్టపడే సత్తువ లేదు. లాక్‌డౌన్‌తో మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం మెహిదీపట్నం సమీపంలోని పోచమ్మ బస్తీలో ఉంటున్న పెద్ద కుమార్తె వీరిని ఆదుకుంటోంది. ఆమెదీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితే. ఉన్నంతలో తల్లిదండ్రులను ఆదరిస్తోంది.

భార్య వైద్య ఖర్చులకు ఎవరైనా సహాయ పడతారనే ఆశతో చక్రాల కుర్చీలో పెట్టుకొని వీధుల్లో తిప్పుతున్నాడు. మనసున్న మహరాజులు ఎంతోకొంత సాయం చేస్తుండగా, ఆ డబ్బుతో ఉస్మానియా దవాఖానాకు తీసుకెళ్లి నెలానెలా మందులు తెచ్చుకుంటున్నాడు. మెహిదీపట్నం ప్రధాన రహదారిపై బుధవారం మధ్యాహ్నం మండుటెండలో భార్యను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకొని వెళుతుండగా ‘ఈటీవీ భారత్’ ఆరా తీసినప్పుడు తన గతాన్ని తలుచుకొని బాలస్వామి కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇదీ చూడండి:లాక్​ డౌన్​ ప్రభావంతో పడిపోయిన మామిడి ధరలు

ABOUT THE AUTHOR

...view details