కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నెలాఖరు వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం... అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 1897 అంటువ్యాధుల చట్టం లాక్ డౌన్‌కు అనుగుణంగా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 22 అంశాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన దుకాణాలు, సంస్థల జాబితాతో పాటు పూర్తి స్థాయిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాల జాబితాను కూడా ఉత్తర్వుల్లో పొందుపర్చారు. నిత్యావసర వస్తువుల రవాణా మినహా అన్ని అంతర్రాష్ట్ర సరిహద్దులు బంద్ చేస్తారు. ఆర్టీసీ బస్సులు, సెట్విన్, మెట్రో రైల్, ట్యాక్సీలు, ఆటోరిక్షాలు బంద్ అవుతాయి. అత్యవసర వైద్యసేవలు పొందేందుకు మాత్రం రవాణా సౌకర్యానికి అనుమతి ఉంటుంది.
ప్రజా రవాణా బంద్
నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే ప్రైవేటు వాహనాలకు అనుమతి ఇస్తారు. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం సూత్రాలను పాటించాలి. ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడడం నిషేధం. వ్యక్తిగత వాహనాలపై డ్రైవర్ మినహా మరొకరు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. ఆహార, ఔషధ సంబంధిత ఉత్పత్తుల దుకాణాలు, సంస్థలకు మాత్రమే బంద్ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా దుకాణాలు, సంస్థలన్నింటినీ బంద్ చేయాల్సిందే.
12 కిలోల రేషన్... 1500 రూపాయలు
పనిచేసే కార్యాలయాలు, దుకాణాల్లో సామాజిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. కౌంటర్ల వద్ద మూడడుగుల దూరంలో మార్కింగ్ చేయాలి. పూర్తి పరిశుభ్రతను పాటించడంతో పాటు శానిటైజర్లు ఏర్పాటు చేయాలి. లాక్ డౌన్ సమయంలో ఆహార భద్రతా కార్డులు కలిగిన 87.59 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. రూ.1,103 కోట్ల విలువైన 3.58 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తారు. కూరగాయలు, ఇతర అవసరాల కోసం ఒక్కో ఆహారభద్రతా కార్డుకు 1500 రూపాయల చొప్పున మెుత్తం 1,314 కోట్ల రూపాయల మేర నగదు పంపిణీ చేస్తారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నీ తాత్కాలిక, ఒప్పంద, పౌరుగు సేవల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలి. లేదంటే 1897 చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నిత్యావసర సరకుల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతారు.