తెలంగాణ

telangana

ETV Bharat / state

LOCKDOWN: రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు - TELANGANA LOCKDOWN NEWS

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ప్రభుత్వం మరో 10 రోజుల పాటు పొడిగించింది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న సడలింపులను సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. బయటి నుంచి ఇంటికి వెళ్లడానికి మరో గంట అదనపు సమయమిచ్చింది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు
రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు

By

Published : Jun 9, 2021, 5:09 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, కేసుల తీవ్రత, సంబంధిత అంశాలపై భేటీలో విస్తృతంగా చర్చించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న కేబినెట్.. రాష్ట్రంలో ఇవాళ్టితో ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు పొడిగించింది. రేపట్నుంచి ఈ నెల 19వ తేదీ వరకు లాక్​డౌన్ అమల్లో ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్​డౌన్ సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంటికి చేరేందుకు మరో గంట పాటు సమయం ఇచ్చి.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసులను కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా పరిస్థితిని మంత్రివర్గానికి వివరించిన వైద్యారోగ్య శాఖ అధికారులు.. కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. అయితే రాష్ట్ర సరిహద్దులో ఉన్న సత్తుపల్లి, మధిర, నాగార్జున సాగర్, నల్గొండ, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని తెలిపారు. దీంతో ఈ 7 నియోజకవర్గాల్లో లాక్‌డౌన్‌ను యథాతథంగా మరో 10 రోజుల పాటు కొనసాగించాలని వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. సడలింపుల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకే పరిమితం చేశారు.

పెళ్లిళ్లకు 40 మంది..

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రకాల వాహనాలు, మెట్రో, ఆర్టీసీ సర్వీసులకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. పెళ్లిళ్లకు 40 మంది వరకే హాజరు కావాలని స్పష్టం చేసింది. అంతిమ సంస్కారాలు, కర్మకాండలకు 20 మందికే పరిమితం చేసింది. ప్రార్థనా మందిరాలు, ఆలయాల మూసివేత కొనసాగుతుందని మంత్రివర్గం వెల్లడించింది. అన్ని రకాల రాజకీయ, మత, అకడమిక్, సాంస్కృతిక సమ్మేళనాలపై నిషేధం కొనసాగనుంది. సినిమా హాళ్లు, పార్కులు, క్లబ్బులు, స్మిమ్మింగ్ పూల్‌లు, బార్లు, పబ్బులు, స్టేడియంలపై నిషేధం విధించారు.

తల్లులు, గర్భిణులకు ఇంటి వద్దకే రేషన్..

అంగన్‌వాడీ సెంటర్లు మూసి ఉంటాయి. చిన్నారులు, తల్లులు, గర్భిణులకు ఇంటి వద్దకే రేషన్ అందించాలని నిర్ణయించింది. యథావిధిగా ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, మెడికల్ సర్వీసులను లాక్‌డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధం రంగాల వారు పనులు చేసుకోవచ్చు. అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం సామర్థ్యంతో పని చేయవచ్చని మంత్రివర్గం స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఈ-పాస్ ఉన్న వారినే అనుమతిస్తామని.. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి లేదని పేర్కొంది.

ఇదీ చూడండి: CABINET: మూడోదశను ఎదుర్కోనేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details