దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్ ప్రభావం వల్ల నిల్వ ఉంచుకునేందుకు గానూ రోగులు ఎక్కువ మొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో వాటి నిల్వలు నిండుకుంటున్నాయి. రక్తపోటు, చక్కెర వ్యాధులకు సంబంధించిన మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవంటూ దుకాణాదారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు సహా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ కీళ్ల నొప్పుల మందులు లభ్యం కావడం లేదు. తయారీదారుల నుంచే సరఫరా నిలిచిపోయిందని విక్రయదారులు పేర్కొంటున్నారు.
ఔషధ కంపెనీల నుంచి మందుల సరఫరా డిమాండ్ మేరకు లేదు. సరుకు రవాణాకు కార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్డర్లను తీసుకోవడం లేదు. ఫలితంగా పంపిణీదారులకు.. వారి నుంచి చిల్లర ఔషధ దుకాణాలకూ సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల టోకు, చిల్లర ఔషధ దుకాణాలు ఉండగా.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కొరత ప్రారంభమైంది.
ముందు జాగ్రత్తగా కొనుగోళ్లు..
లాక్‌డౌన్ నుంచి ఔషధ దుకాణాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినా రోగులు ముందు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో చక్కెర, బీపీలకు సంబంధించిన మందుల నిల్వలన్నీ అయిపోయాయని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన ఓ ఔషధ దుకాణం యజమాని తెలిపారు. కీళ్లనొప్పుల మందులను రెట్టింపు పరిమాణంలో కొనుగోలు చేయడం వల్ల తమ ప్రాంతంలో వాటి నిల్వలు నిండుకున్నాయని వికారాబాద్ జిల్లా కోస్గి మండలంలోని ఓ విక్రయదారుడు పేర్కొన్నారు. గ్రామీణులు, ఔషధ దుకాణాలు అందుబాటులో లేనివారు కనీసం మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేస్తున్నట్లు చాలామంది విక్రయదారులు పేర్కొన్నారు.
ఆరు రోజులుగా నిలిచిన సరఫరా..