కరోనా కాలంలో అర్చకుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. లాక్డౌన్ ప్రభావం ఆలయాలు, అర్చకులపై తీవ్రంగా పడుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అర్చన, హారతి, అభిషేకాలు, కల్యాణాలు, వ్రతాలు, తల నీలాల టికెట్లతో నిత్యం కలకలలాడిన ప్రాంగణాలు నేడు నిర్మానుశ్య వాతావరణంలో మూగబోతున్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడిన అర్చకులు, వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరోవైపు శుభకార్యాలు, బయటి కార్యక్రమాలు లేక పూజారులను ఆర్థిక సమస్యలు చుట్టుముడుతున్నాయి.
లాక్డౌన్ సడలింపు సమయంలో ఆలయాలు తెరిచే ఉంటున్నా.. ఆ సమయాన్ని నిత్యావసరాలు, పనుల చేసుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. పవిత్రమైన దినాల్లోనూ కరోనా కారణంగా భక్తులు ఆలయాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. హుండీ ఆదాయం 90 శాతం పడిపోయింది. అర్చకులకు హారతి పళ్లెంలో సమర్పించే కానుకలు కూడా అందడం లేదు.