రాష్ట్రంలో కొవిడ్ రెండో దశ ప్రభుత్వ ఆదాయాలను తీవ్రంగా దెబ్బతీసేట్లు కనిపిస్తోంది. మే 12 నుంచి అమలులో ఉన్న లాక్‌డౌన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తోంది. మార్చి చివరి వారం నుంచి రాష్ట్రంలో కొవిడ్ రెండో దశ వ్యాప్తి అధికమైనప్పటికీ ఏప్రిల్ నెలలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే రాబడి ఆశాజనకంగానే ఉంది. ఏప్రిల్ నెలలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 4,675 కోట్ల మేర ఆదాయం చేకూరింది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వ్యాట్ రాబడి రూ. 1,058 కోట్లు, మద్యం విక్రయాల ద్వారా వ్యాట్ రాబడి రూ.845 కోట్లు, వస్తు సేవల పన్ను ద్వారా రూ. 2,704 కోట్లు, ఇతరత్రా 57 కోట్లు, జీఎస్టీ నష్టపరిహారం కింద రూ.269 కోట్లు ఆదాయం వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు.
కనిపించని కర్ఫ్యూ ప్రభావం
రాష్ట్రంలో కర్ఫ్యూ ఏప్రిల్ నెలలోనే అమలులోకి వచ్చినప్పటికీ... ఆ ప్రభావం వ్యాపార, వాణిజ్య సంస్థలపై పెద్దగా పడలేదు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అములులో ఉన్నందున... వ్యాపార, వాణిజ్య సంస్థలకు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. కాని మే 12 నుంచి మొదలైన లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం నాలుగు గంటలు మాత్రమే దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ 4 గంటల్లో వ్యాపార, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలు తెరవలేని పరిస్థితులు. దీంతో సాధారణ రోజుల్లో వచ్చే ఆదాయం... లాక్‌డౌన్ అమలు సమయంలో వచ్చే అవకాశాలు లేవు. ఇప్పుడొస్తున్న రాబడిలో సగం కంటే కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.