కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ తొలిరోజు ప్రభావం ఇది. ఈ నెల 21 వరకు రోజూ 20 గంటల పాటు విధించిన లాక్‌డౌన్ బుధవారం అమల్లోకి వచ్చింది. సడలింపు ఇచ్చిన సమయం తర్వాత.. హైదరాబాద్‌లోనూ, జిల్లాల్లోనూ దుకాణాలు మూతబడ్డాయి. ఇతర కార్యకలాపాలూ నిలిచిపోయాయి.
కొద్దిసేపే సడలింపులు
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ తొలి రోజు పకడ్బందీగా అమలైంది. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత రోజువారీ కార్యకలాపాలు క్రమేపీ నిలిచిపోవడంతో రాష్ట్రమంతటా ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. 10 గంటలకు లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటికీ హైదరాబాద్ సహా నగరాల్లో రోడ్లపై కొంత రద్దీ కనిపించింది. తొలి రోజు కావడంతో కొద్దిసేపు సడలింపు ఇచ్చిన పోలీసులు 11 గంటల తర్వాత.. నిబంధనల అమలుపై దృష్టి పెట్టారు.
తెరుచుకునే సమయానికే మూత
బార్లు.. వైన్స్‌లు.. వస్త్రాల దుకాణాలు.. ఎలక్ట్రానిక్ షాప్‌లు.. షాపింగ్ మాళ్లు.. సాధారణంగా ఉదయం 10- 11 గంటలకు గాని తెరుచుకోవు. బుధవారం మాత్రం ఉదయం 6 గంటల నుంచే వీటిలో అత్యధికం తెరుచుకున్నాయి. సాధారణంగా తెరుచుకునే సమయానికి మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఉదయం 10 గంటలకల్లా ఆఖరి ట్రిప్పు పూర్తి చేసుకుని డిపోలకు చేరాయి. రైళ్లు మాత్రం యథావిధిగా రాకపోకలు సాగించాయి. కొవిడ్ టీకాలు, పరీక్షలు కొనసాగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పోస్టాఫీసులు యథావిధిగా పనిచేశాయి. అత్యవసరంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు ప్రయాణించేవారికి ఆయా జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు పాస్‌లు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 700 పాస్‌లు జారీ అయ్యాయి.
సమీక్షించిన మంత్రులు
కొందరు మంత్రులు లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో అధికారులతో కలిసి పర్యటించారు. రహదారులు- భవనాలు, గృహనిర్మాణ శాఖ మంతి వేముల ప్రశాంత్‌రెడ్డి లాక్‌డౌన్ అమలుపై కామారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు.
ప్రయాణికుల ఇబ్బందులు
బస్సు ప్రయాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే పరిమితం కావడంతో పలుచోట్ల ప్రయాణికులు బస్టాండ్లలో చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి ఉదయం 6-7 గంటలకు బయల్దేరి కరీంనగర్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలకు వెళ్లినవారు.. అక్కడి నుంచి ఇతర పట్టణాలు, గ్రామాలకు వెళ్లేందుకు బస్సులు లేక ఇబ్బందిపడ్డారు. జేబీఎస్, ఆరాంఘర్ చౌరస్తా, ఉప్పల్‌లో బస్సు ప్రయాణికుల రద్దీ పెరిగింది. పలువురు ప్రైవేటు వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. అంతర్రాష్ట సర్వీసుల్ని ఆర్టీసీ నిలిపివేసింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య కొంత పెరిగింది. కూరగాయల మార్కెట్లలో రద్దీ ఒక్కసారిగా ఏర్పడింది.
కావాల్సినవి కొనుగోలు
సడలింపు నాలుగు గంటలే ఇవ్వడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో జనాలు ఉదయమే మార్కెట్లకు వెళ్లి కూరగాయలు, దుకాణాలకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్కెట్లు, దుకాణాలు మూతబడ్డాయి. జాతీయ రహదారుల్లో రద్దీ పెరిగింది. హైదరాబాద్- విజయవాడ మార్గంలో పంతంగి టోల్‌ప్లాజ్ వద్ద ఇరువైపులా కలిపి ఉదయం 6-10 గంటల మధ్య సగటున రోజుకు 3,100 వాహనాలు వెళ్లేవి. బుధవారం ఆ సంఖ్య రెట్టింపై 6,550కి చేరింది. చాలామంది సొంత వాహనాలు, బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ మార్గంలో రోజుకు గరిష్ఠంగా 30వేలకు పైగా వాహనాలు వెళ్లేవి. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తర్వాత 21 వేలకు పరిమితమైంది.
స్వీయనియంత్రణ పాటించాలి: డీజీపీ
‘‘ఐజీల నుంచి ఎస్పీల వరకు లాక్‌డౌన్ అమలుపై స్పష్టత ఇచ్చాం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తిరిగి పర్యవేక్షించారు. ఆసుపత్రులకు, వాక్సిన్ కోసం వెళ్లేవారికి పోలీసులు సహకరించారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించడం అవసరం. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అవసరాల మేరకే ప్రజలు బయటికి రావాలి. ఫార్మా, ఐటీ, నిర్మాణ రంగ పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు నిర్వాహకులతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ సహకారం అందిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత, నిత్యావసర సరకుల రవాణా ప్రక్రియ సాఫీగా సాగేలా క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించాం’’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
బారికేడ్లు.. వాహనాల తనిఖీలు