హైదరబాద్‌లో మార్చి 23 నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పోలీసులు మొదటి రోజు నుంచి ప్రధాన రహదారులను మూసేశారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులే కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి, ప్రజావసరాలను తీర్చారు. కేసులు తగ్గగానే జోన్లను ఎత్తేస్తూ వచ్చారు.
ఇది చూసి కొందరు కాలనీ వాసులు కరోనాతో సంబంధం లేకున్నా దారులు మూసేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ‘దిక్కున్న చోట చెప్పుకో’ అంటున్నారు. మాట్లాడితే దాడులు చేస్తున్నారు. ఫలితంగా కాలనీల్లో ప్రజలు నిత్యావసరాలకు ఇబ్బందిపడుతున్నారు. కిరాణా దుకాణాలు మూతపడుతున్నాయి. సంచార రైతుబజార్లు, గ్యాస్ వాహనాలు రాలేకపోతున్నాయి. పోలీసుల ఉదాసీన వైఖరితోనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వీధుల్లో కర్రలు అడ్డుపెట్టడం వల్ల ఘర్షణ వాతావరణ నెలకొంటోంది.
ఆలకించండి.. అవస్థలు ఇవిగో..
* వివేకానందనగర్‌కాలనీ, ఏఎస్‌రాజునగర్, జలవాయువిహార్ కాలనీల రోడ్లు మూతపడ్డాయి. హెచ్‌ఎంటీ శాతవాహన, హెచ్‌ఎంటీహిల్స్, ఇంద్రానగర్ తదితర బస్తీవాసులు చుట్టూ కిలోమీటరుకుపైగా తిరిగి ఇంటికి చేరుకోవాల్సి వస్తోంది. కేపీహెచ్‌బీకాలనీ తొమ్మిదో ఫేజులోకి బయటివారు ప్రవేశించకుండా మూడు వైపులా రోడ్డును మూశారు. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ పరిధిలోని కొన్ని కాలనీలకు ప్రవేశమే లేకుండా పోయింది.
* ఖైతరాబాద్ ఆనంద్‌నగర్ కాలనీ నుంచి పక్కనే ఉన్న చింతబస్తీ మార్కెట్‌కు వెళ్లాలంటే కిలోమీటరున్న దూరం తిరిగాల్సి వస్తోంది.
* యూసఫ్‌గూడ పరిధిలోని మధురానగర్, ఇతరత్రా కాలనీల్లో కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్లు రహదారులను మూసేశాయి.
* ముషీరాబాద్‌లో సాయిరెడ్డి వీధి, ఎంసీహెచ్‌కాలనీ, మోహన్‌నగర్, బ్రహ్మంగారి దేవాలయం వీధి, రాంనగర్ జెమినీ కాలనీ ప్రాంతాల్లో రోడ్లపై కర్రలు అడ్డుగా వేశారు.
* ఉప్పల్ డివిజన్ పరిధిలో శ్రీనగర్‌కాలనీ వీధుల్లో ముళ్ల కంచెలు వేశారు. దీంతో స్థానికుల మధ్య వివాదాలు రేగుతున్నాయి.