రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించిన ప్రభుత్వం - cm kcr news
20:39 May 18
రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించిన ప్రభుత్వం
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. లాక్‌డౌన్ విధించిన తర్వాత కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ మంత్రులందరితో ఇవాళ ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మే 30 వరకు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో, వైద్య సేవల పర్యవేక్షణలో భాగంగా మంత్రులు క్షేత్రస్థాయిలో ఉన్నందున ఈ నెల 20న నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని సీఎం రద్దు చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలివే..
ప్రస్తుతం రోజూ ఉదయం 10 గంటల నుంచి 20 గంటల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. జన సంచారం, క్రయవిక్రయాలు, ఇతర కార్యకలాపాలకు నిషేధాజ్ఞలు వర్తిస్తాయని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ప్రజల సౌకర్యార్థం రోజూ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులు, ఇతర కొనుగోళ్లకు, కార్యకలాపాలకు వీలు కల్పించారు. అత్యవసర సేవలు, ధాన్యం ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో యథావిధిగా పనిచేస్తాయి. ఉపాధిహామీ పనులూ యథావిధిగా కొనసాగుతాయి. బ్యాంకులు, ఏటీఎంలు పనిచేస్తాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సేవలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయి. వంట గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు అంతర రాష్ట్ర బస్సు సర్వీసులను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి:నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం