తెలంగాణ

telangana

ETV Bharat / state

కూతలేనిదే... బతుకు బరువు మోసేదెలా? - corona effect on railway coolie

ఎర్ర చొక్కా.. చేతికి గుర్తింపు ఇత్తడి ఆభరణం.. ఇలా స్టేషన్​లో బండి ఆగగానే ప్రయాణికులను పలకరించి.. ఎంతో కొంత ఇవ్వండి బాబు.. అని బరువును నెత్తిన, భుజాన వేసుకుని బయటకు తీసుకువచ్చి... తాను అనుకున్నదానికి రూ.10లు ఎక్కువ ఇస్తే దండం పెట్టి వెనక్కి వెళ్లే రైల్వే కూలీ మూడు నెలలుగా ఆగమైపోయాడు.

railway cooli
railway cooli

By

Published : Jul 1, 2020, 9:31 AM IST

మార్చి 25 నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్‌ అవ్వడంతో రైల్వే కూలీలు కుదేలైపోయారు. ప్రత్యేక రైళ్లు నడిచినా.. అవి పరిమిత సంఖ్యలో ఉండడంతో ప్రయాణికులు చేతి బ్యాగులు మోసుకొని ప్రయాణాలు సాగించేశారు. మరో 18 రైళ్లు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నా.. అవి కూడా రైల్వే కూలీల ఆకలి తీర్చలేకపోతున్నాయి. అలవాటు పడిన ప్రాణాలు కనుక.. రైల్వే స్టేషన్‌కు చేరుకుని పట్టాలవైపు దీనంగా చూస్తున్నారు.

500 మంది రైల్వే కూలీలకు కష్టకాలం..

సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రోజు 315 రైళ్ల వరకూ రాకపోకలు సాగించేవి. ఇలా ఈ మూడు స్టేషన్ల నుంచి 3.50 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే ప్రయాణికుల బ్యాగులు మోసి ఈ మూడు రైల్వే స్టేషన్లలో కలిపితే 500లకు పైగా రైల్వే కూలీలు జీవనోపాధి పొందేవారు. మూడు నెలలుగా బరువు మోయక నెత్తి తేలికగా మారిపోగా.. రూపాయి రాక జేబు ఖాళీగా మారిపోయింది.

కూలీల జీవితాలు ప్రశ్నార్థకం

ద.మ. రైల్వే అధికారులు, రైల్వే ఉద్యోగుల మహిళా సంఘం, రైల్వే వాణిజ్య విభాగాలు కలిసి.. రైల్వే కూలీలందరికీ రెండు పర్యాయాలు 10 కేజీలు బియ్యం, రూ. 600ల విలువైన రేషన్‌ సరకులు, రూ.500లు ఇచ్చి ఆదుకున్నారు. ఈ సాయం వారికి ఎంతో ఊరటనిచ్చినా.. ఒక వారం, రెండు వారాలు, నెల అయితే ఫర్వాలేదు కాని.. ఏకంగా 3 నెలలు రైళ్లు పూర్తి స్థాయిలో నడవకపోవడంతో.. మళ్లీ వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఇప్పుడు ఆగస్టు నెల 12 వరకూ రైళ్లు నడవవని భారతీయ రైల్వే ప్రకటించడంతో.. దిక్కు తోచని స్థితిలో రైల్వే పట్టాలవైపు చూస్తున్నారు.

తినడమే కష్టంగా మారిపోయింది

ప్రస్తుతం 18 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అందరమూ ఎర్రచొక్కా వేసుకుంటే.. ఎవరికీ కడుపు నిండదని.. వాటాలేసుకుని రోజుకు 30 మంది వరకూ స్టేషన్లకు చేరి మూటాముల్లె మోసుకొని వచ్చిన ఆదాయంతో ఇంటి ముఖం పడుతున్నాం. స్టేషన్‌కు రావడానికే రూ.100 వరకూ ఖర్చు అవుతుంటే.. రోజుకు కూలీ డబ్బులు రూ.300లు దాటడంలేదు. ఇంటి అద్ధె. పిల్లల చదువులు ఇలా తలచుకుంటే.. కంటిమీద కునుకు రావడంలేదు.

- నరసింహా, రైల్వే కూలీ

ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్‌ కిక్కు.. ఒక్కరోజే డబుల్

ABOUT THE AUTHOR

...view details