లాక్‌డౌన్ వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బతుకు చిత్రం చితికిపోయి కన్నీళ్లకే కన్నీరొచ్చే ఉదంతాలు హైదరాబాద్లో చాలా వెలుగు చూస్తున్నాయి.
* ఏసీగార్డ్స్‌లో యునానీ వైద్యునిగా ఎంతోమంది పేదలకు సేవలు అందించే ఓ వైద్యునికి, అతని భార్యకు కరోనా సోకింది. గాంధీలో చికిత్స పొందుతూ వైద్యుడు కన్నుమూయడంతో భార్య ఒంటరి అయిపోయింది. ఇంట్లో వారంతా ఆసుపత్రికే పరిమితం కావడం, బంధువులు రాకపోవడంతో చివరికి ఆ వైద్యునికి జీహెచ్‌ఎంసీ సిబ్బందే అంత్యక్రియలు చేపట్టారు.
* గాజులరామారం సర్కిల్ పరిధిలో ఓ నిరుపేద కుటుంబం పరిస్థితి మరీ దైన్యం. ఆటో డ్రైవరుగా పనిచేసే కుటుంబపెద్దకు కరోనా సోకడంతో మార్చి 24న గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. మూడు రోజులకు అతని భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెకు కరోనా సోకడంతో వారినీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో మరికొన్ని రోజులకు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న అతని మనవడికి, ఆ పసివాడికి తోడుగా ఉంటున్న చిన్న కోడలికీ కరోనా వచ్చింది. ఆమెకూ అదే ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెద్ద ఏప్రిల్ 1న మృతి చెందాడు. అతని కుటుంబసభ్యులంతా చికిత్స పొందుతుండటంతో వారికి కనీసం కడచూపు దక్కలేదు. జీహెచ్‌ఎంసీ సిబ్బందే అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడి పెద్ద కోడలు పిల్లలను తీసుకుని తన తల్లిగారి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది.
* వనస్థలిపురంలోని ఒకే కుటుంబంలో తండ్రి, కుమారుడు రోజు వ్యవధిలో కరోనాతో కన్నుమూశారు. ఇంటిపెద్దలను కోల్పోయి ఆ కుటుంబం అనాథలా మారింది. అంత్యక్రియలకు కూడా వెళ్లలేని పరిస్థితి.
* జియాగూడ వెంకటేశ్వరనగర్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి(65)ని పోషిస్తున్నాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతున్న భార్యకి అనారోగ్యంగా ఉండటంతో ఉస్మానియాలో చేర్పించారు. కరోనా లక్షణాలు తేలడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఏప్రిల్ 30న మృతి చెందింది. ప్రస్తుతం భర్తకు ఆరోగ్యం బాగా లేదు. నడుం కింద శస్త్రచికిత్స చేశారు. ఎక్కువసేపు కూర్చొలేని, నడవలేని స్థితి. ఇప్పుడు అతనికీ కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ ఇంటికి కుమారుడే దిక్కు. లాక్‌డౌన్ కారణంగా అతనికున్న కొద్దిపాటి ఉపాధీ పోయింది.ప్రస్తుతం ఆ కుటుంబంలోని మిగతా వారంతా హోం క్యారంటైన్‌లో ఉన్నారు. ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటోంది. ఆదుకునే వారికోసం ఎదురు చూస్తోంది.